ఇజ్రాయెల్-ఇరాన్.. ఎవరి బలం ఎంత? ఎవరి దమ్ము ఎంత?.. సమఉజ్జీలేనా?
చుట్టూ ముస్లిం ప్రాబల్య దేశాలు.. మధ్యలో ఇజ్రాయెల్.. ఇదొక సంక్లిష్ట పరిస్థితి. అయినా 80 ఏళ్లుగా ఆ దేశం మనుగడ సాగిస్తూనే ఉంది.
By: Tupaki Desk | 13 Jun 2025 5:14 PM ISTచుట్టూ ముస్లిం ప్రాబల్య దేశాలు.. మధ్యలో ఇజ్రాయెల్.. ఇదొక సంక్లిష్ట పరిస్థితి. అయినా 80 ఏళ్లుగా ఆ దేశం మనుగడ సాగిస్తూనే ఉంది. ఎన్నోసార్లు ఘర్షణలు.. భారీ యుద్ధాలు.. అయితే, ఇన్నాళ్లుగా చుట్టూ ఉన్న దేశాలతోనే ఇజ్రాయెల్ పోరాడింది. ఇప్పుడు మాత్రం సుదూరాన ఉన్న ఇరాన్ మీదకు కత్తి దూసింది. ఐఆర్జీసీ చీఫ్ నే హతమార్చింది. ఇక ఇరాన్ ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుంది...? అనేదే చూడాలి.
వాస్తవానికి గాజా హమాస్ మిలిటెంట్లు 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్ లోకి చొరబడి మారణకాండకు పాల్పడినప్పుడే సుదీర్ఘ కాల సమరానికి బీజం పడింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ ల అడ్డా అయిన గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. ఈ యుద్ధం అటు లెబనాన్ కూ విస్తరించింది. సిరియా కూ పాకింది. చివరకు ఇరాన్ వరకు వెళ్లింది. గత ఏడాది ఇరాన్ ఇజ్రాయెల్ మీదకు క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది.
ఇప్పుడు ఏకంగా ఇరాన్ అణు స్ధావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ బలాబలాలు ఏమిటో చూస్తే..? వైశాల్యం పరంగా చూస్తే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. కేవలం 20 వేల చదరపు కిలోమీటర్లు అంతే. ప్రపంచంలో 149వ స్థానంలో ఉంది. ఇరాన్ మాత్రం 16 లక్షల చదరపు కిలోమీటర్లుకు పైగా వైశాల్యంతో 17వ స్థానంలో ఉంది.
ఆయుధ, సైనిక సామర్థ్యంలో చూస్తే.. ఇరాన్ కు 6.10 లక్షల మంది సైనికులున్నారు. ఇజ్రాయెల్ కు 1.69 లక్షల మందే ఉన్నారు.
-ఇజ్రాయెల్ రిజర్వ్ ఫోర్స్ 4.65 లక్షలు కాగా.. ఇరాన్ 3.50 లక్షలు మాత్రమే.
-ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 27.5 బిలియన్ డాలర్లు. ఇరాన్ ది 10.3 బిలియన్ డాలర్లు
-ఇజ్రాయెల్ కు 340 ఫైటర్ జెట్లు ఉంటే ఇరాన్ కు 312 ఉన్నాయి
-ఇజ్రాయెల్ ఆర్టిలరీ 530 కాగా..ఇరాన్ 6,798.
-సైనిక హెలికాప్టర్లు ఇజ్రాయెల్ కు 46 ఉండగా, ఇరాన్ కు 34.
-జలాంతర్గాములు ఇజ్రాయెల్ కు 5 ఉండగా, ఇరాన్ కు 19 ఉన్నాయి.
---ఇజ్రాయెల్ కు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఐరన్ డోమ్ వ్యవస్థ ఉంది. ఇరాన్ కు అంత సామర్థ్యం లేదు. ఇజ్రాయెల్ కు అమెరికా అండ ఉంది. ఇరాన్ కు అమెరికాకు ఆగర్భ శత్రువు. ఇజ్రాయెల్ తెగించి దాడి చేయగలదు. ఇరాన్ కు కొన్ని పరిమితులు ఉన్నాయి.
