Begin typing your search above and press return to search.

ఇరాన్ పై అమెరికా దాడి.. నెతన్యాహు రియాక్షన్ ఇదే!

అవును... బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌ పై అమెరికా విరుచుకుపడింది. ఫోర్డో, ఇస్ఫాహన్, నతాంజ్‌ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:40 AM IST
ఇరాన్  పై అమెరికా దాడి.. నెతన్యాహు రియాక్షన్  ఇదే!
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇరాన్ పై దాడి చేయాలా లేదా అనేది ట్రంప్ రెండు వారాల తర్వాత వెల్లడిస్తారని వైట్ హౌస్ ప్రకటించిన 48 గంటల్లోనే అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. ఇరాన్ లో అణుస్థావరాలపై దాడులు చేసింది. దీనిపై నెతన్యాహు స్పందించారు.

అవును... బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌ పై అమెరికా విరుచుకుపడింది. ఫోర్డో, ఇస్ఫాహన్, నతాంజ్‌ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. మిషన్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. దీనిపై ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇరాన్‌ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా విరుచుకుపడిన విషయం తీవ్ర సంచలనంగా మారిన వేళ.. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. అమెరికా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.

ఇందులో భాగంగా... ప్రెసిడెంట్ ట్రంప్‌ నకు అభినందనలు అని చెప్పిన నెతన్యాహు... మీ అద్భుతమైన, ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్‌ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని.. ఈ మీ నిర్ణయం సాహసోపేతమైనదని.. ఇది చరిత్రను మార్చేస్తుందని.. ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ లో ఇజ్రాయెల్‌ అద్భుతమైన ప్రయోజనాలను అందుకుందని అన్నారు.

ఇదే సమయంలో... తాజాగా ఇరాన్ లోని అణుకేంద్రాల లక్ష్యంగా అమెరికా చేసిన దాడులు నిజంగా అద్వితీయమైనవని.. భూమిపై మరే దేశం చేయలేనిది మీరు చేశారని ప్రశంసలతో ముంచెత్తిన నెతన్యాహు.. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, దాని వద్ద ఉన్న ఆయుధాలను అంతం చేసేందుకు ట్రంప్‌ వ్యవహరించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

మరోవైపు ఈ దాడి అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్... ఇరాన్‌ పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ఈ సందర్భంగా... యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్‌ వచ్చిందని తెలిపారు. అక్కడున్న కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశామని.. దాని అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు!