ఇరాన్ కు గ్యాప్ ఇవ్వడం లేదు.. మరో కీలక కమాండర్ హతం!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 21 Jun 2025 7:22 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు ఎనిమిది రోజులుగా అవిరామంగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు చెందిన కీలక వ్యక్తులను ఇజ్రాయెల్ మట్టుబెడుతుంది. ఇందులో రక్షణ శాఖ కీలక అధినేతలతో పాటు అణు శాస్త్రవేత్తలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక కమాండర్ ని హతమర్చింది ఐడీఎఫ్.
అవును... ఇరాన్ లోని అణు స్థావరాలు, కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఎందరో కీలక నేతలను కోల్పోయిన టెహ్రాన్ కు తాజాగా మరో దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్ రియారీ హతమయినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
ఇరాన్ నుంచి హమాస్, హెజ్ బొల్లా, హూతీ తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో ఈ షాహ్ రియారీ ప్రధాన పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇదే సమయంలో.. 2023లో అక్టోబర్ 7న జరిగిన ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులకు ప్రణాళికలు రచించింది అతడే అని.. ఇరాన్, హమాస్ ల మధ్య కీలక సమన్వయ కర్తగానూ ఇతడు వ్యవహరించాడని వెల్లడించింది.
ప్రధానంగా.. యుద్ధ సమయంలో, లెబనాన్ నుండి పనిచేస్తున్న హమాస్ దళాలను నడిపించే బాధ్యత కూడా ఆయనపై ఉందని.. అప్పటి నుండి, హమాస్ సైనిక విభాగాన్ని పునర్నిర్మించడానికి, గాజాలో హమాస్ నియంత్రణ అధికారంగా ఉండేలా చూసుకోవడానికి ఆయన కట్టుబడి ఉన్నారని 'ఎక్స్' వేదికగా వెల్లడించింది.
ఈ సందర్భంగా... శుక్రవారం ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లు జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాది సహా పలువురు నేతలు మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) శనివారం ధ్రువీకరించాయి.
కాగా... ఆపరేషన్ 'రైజింగ్ లయన్' పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్ కు చెందిన పలువురు కీలక నేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ ఉన్నారు.
వీరితోపాటూ సాయుధ దళాల ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి జనరల్ అమీర్ అలీ హాజీజదే వంటి కీలక నేతలు మృతిచెందారు. అదేవిధంగా అణు కార్యక్రమంలో పని చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు.
