Begin typing your search above and press return to search.

టార్గెట్ ‘ఇస్ఫహాన్’... ఇరాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్!

ఈ క్రమంలోనే తాజాగా కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారులు ధృవీకరించారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 4:01 PM IST
టార్గెట్ ‘ఇస్ఫహాన్’... ఇరాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్!
X

ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇరాన్ లో ఎక్కడ అణు స్థావరం ఉందనే నిఘా సమాచారం అందినా.. వెంటనే అక్కడ క్షిపణులతో విరుచుకుపడిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.

అవును... ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం మొదలై రెండోవారంలోకి ఎంటరయ్యింది. ఈ సమయంలో ఇజ్రాయెల్ తాజాగా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఇరాన్ లో ఎక్కడ అణు కేంద్రం కనిపించినా వెంటనే బాంబులతో దాడి చేస్తుంది. దాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారులు ధృవీకరించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదకర వాయువులు లీక్‌ అవ్వలేదని అంటున్నారు. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... టెహ్రాన్‌ సహా ఇరాన్‌ లోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే... పశ్చిమ ఇరాన్‌ లోని బాలిస్టిక్‌ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. దీంతో.. అక్కడ తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అదేవిధంగా... రాస్త్‌ నగరంపైనా బాంబులతో విరుచుకుపడింది.

ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్... ఇజ్రాయెల్‌ ఫైటర్ జెట్‌ లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం, డ్రోన్ యూనిట్ కమాండర్‌ ను చంపినట్లు ప్రకటించింది. టెల్‌ అవీవ్‌ పై ఇరాన్‌ చేసిన వందలాది డ్రోన్‌ దాడులకు అతడు ప్రాతినిథ్యం వహించాడని తెలిపింది.

మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్.. ఐడీఎఫ్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా... ఇరాన్‌ పాలనను అస్థిరపరచడానికి దాడులను మరింత తీవ్రతరం చేయాలని.. ఇరాన్‌ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు.

ఇదే సమయంలో... టెహ్రాన్‌ లోని శక్తిమంతమైన బాసిజ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వంటి కేంద్రాలను ధ్వంసం చేయాలని సూచించిన రక్షణ మంత్రి కాట్జ్.. ఇరాన్ ను ఏమాత్రం తేరుకోనివ్వకుండా టార్గెట్ ఫినిష్ చేయాలని తెలిపారు.