ఇదే అసలు రహస్యం... ఇరాన్ పై సడన్ గా యుద్ధం ఎందుకో తెలుసా?
ఈ సమయంలో గురువారం రాత్రి (జూన్ 12)న ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇరాన్ పై క్షిపణుల వర్షం కురిపించింది.
By: Tupaki Desk | 16 Jun 2025 4:14 PM ISTఓవైపు అమెరికాతో ఇరాన్ కు అణు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆదివారం (జూన్ 15)న ఆరో విడత చర్చలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఈ చర్చలపై ఒక క్లారిటీ రావొచ్చనే ప్రచారమూ జరుగుతోంది. ఈ సమయంలో గురువారం రాత్రి (జూన్ 12)న ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇరాన్ పై క్షిపణుల వర్షం కురిపించింది.
ఈ క్రమంలో టెహ్రాన్ లోని ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్ట్ పైనా ఇరాన్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పైనా మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే.. ఓ వైపు అమెరికాతో ఇదే అణ్వాయుధాలపై చర్చలు జరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్ సడన్ గా ఈ రేంజ్ లో ఎందుకు ఇరాన్ పై విరుచుకుపడింది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. తాజాగా దానికి సమాధానం వచ్చేసింది.
అవును... అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడటానికి గల కారణం తెలిసింది. అందుకు గల కారణం.. ఇరాన్ న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన డిజైన్ ప్రాసెస్ కు సంబంధించి అత్యంత కీలక ప్రయోగం చేసిందనే గోల్డెన్ ఇన్ఫర్మేషన్.. టెల్ అవీవ్ కు అందిందంట. దీంతో.. టెహ్రాన్ తలచుకుంటే కొన్ని వారాల్లోనే అణుబాంబులను రూపొందించగలదని ఇజ్రాయెల్ ఓ నిర్ధారణకు వచ్చిందంట.
ఇదే సమయంలో... ఆయుధ శ్రేణి యురేనియం నుంచి ఓ పేలుడు పరికరాన్ని తయారుచేసేందుకు పలు వర్కింగ్ గ్రూప్ లను ఇరాన్ ఏర్పాటుచేసిందని సమాచారం అందిందంట! దీంతో.. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన ఇజ్రాయెల్... మరో ఆలోచన లేకుండా ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడిందని "టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్" కథనంలో పేర్కొంది.
దీనికి తోడు పౌర అవసరాలకు మించి యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తూనే ఉందట. ఇదే సమయంలో.. అటామిక్ ఎనర్జీ సంస్థ గత నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం మరింత శుద్ధి చేస్తే 9 అణుబాంబుల తయారీకి సరిపోతుందని పేర్కొంది. దీంతో.. ఇజ్రాయెల్ తన తొలిదాడిలోనే అనుభవజ్ఞులైన సుమారు ఆరుగురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలను అంతం చేసింది.
దీనికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్ కోవర్టు బలగాలు ట్రక్కులు, కంటైనర్లు, సూట్ కేసుల్లో ఇరాన్ లోకి చేర్చారట. అనంతరం.. వీటిని ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొస్సాద్ ఏజెంట్లు సమీకరించి.. అవసరమైన బలగాలకు చేర్చాయి. దీంతో.. గురువరం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ శ్రేణులు ఇరాన్ పై దాడులు చేశాయి. ఇవి ప్రధానంగా ఇరాన్ అణుశాస్త్రవేత్తలు, ఇరాన్ టాప్ మిలటరీ జనరల్ ను లక్ష్యంగా చేసుకున్నాయి.
వాస్తవానికి ఎలాంటి యుద్ధ సంకేతాలు వీరికి వచ్చినా వీరంతా.. దాడులను తట్టుకునే షెల్టర్స్ లోనే నివాసం ఉండేవారు. అయితే.. ఓ పక్క అమెరికాతో తమకు అణు చర్చలు జరుగుతున్నందు వల్ల ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం లేదని వీరంతా భావించారంట. దీంతో... వీరంతా ప్రైవేట్ హౌసెస్ లో బస చేశారు. ఆ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్.. వారు నివాసమున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ పై నేరుగా దాడి చేశాయి.
