Begin typing your search above and press return to search.

ఇరాన్ లో 'అరాక్' పై ఇజ్రాయెల్ దాడి... ఏమిటీ హెవీ వాటర్ రియాక్టర్..!

ఈ క్రమంలోనే తాజాగా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐ.డీ.ఎఫ్) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 7:00 PM IST
ఇరాన్  లో అరాక్ పై ఇజ్రాయెల్  దాడి... ఏమిటీ హెవీ వాటర్  రియాక్టర్..!
X

ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలను, అణ్వాయుధ ప్రణాళికలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... పెద్ద ఎత్తున యుద్ధ విమానాలతో ఇరాన్ పై విరుచుకుపడుతుంది. ఈ సమయంలో.. ఫలాన్నా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోస్ట్ పెట్టిన కాసేపటికే అక్కడ ఐడీఎఫ్ దాడులు చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా అరాక్ పై ఐడీఎఫ్ దాడులు చేసింది.

అవును... ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించిన ఇజ్రాయెల్.. ఇప్పటికే పలు యురేనియం శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐ.డీ.ఎఫ్) సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. అలా పోస్ట్ ద్వారా హెచ్చరించిన కాసేపటి తర్వాత అక్కడ ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి.

అణు బాంబు తయరీ కోసం టెహ్రాన్ కు ఉన్న అన్ని వనరులను సమూలంగా నిర్వీర్యం చేసేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్.. తాను చేయగలిగినంత చేసుకుంటూ పోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అరాక్ హెవీ వాట రియాక్టర్ ప్లాంట్‌ ఉపగ్రహ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అక్కడి ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా.. ఆ రియాక్టర్‌ సమీపంలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించింది.

అలా హెచ్చరిక పోస్ట్ చేసిన కొన్ని గంటలకే అరాక్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. శుద్ధి చేసిన యురేనియం లేకుండానే అణుబాంబును అభివృద్ధి చేసేందుకు ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లుటోనియంను ప్రత్యామ్నాయంగా ఇరాన్ ఉపయోగించుకుంటుందని అంటున్నారు.

టెహ్రాన్‌ కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అరాక్‌ హెవీ వాటర్‌ రియాక్టర్‌ ను న్యూక్లియర్‌ రియాక్టర్లు చల్లబర్చేందుకు ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో ప్లూటోనియం ఉప ఉత్పత్తిగా లభిస్తుందట. దీన్ని అణ్వాయుధాల తయారీలోనూ వినియోగిస్తారు. దీంతో... ఈ విషయం గ్రహించిన ఇజ్రాయెల్.. తాజాగా ఈ హెవీ వాటర్‌ రియాక్టర్‌ పై దాడులు చేసింది.

కాగా... 2015లో ప్రపంచదేశాలతో కలిసి ఇరాన్‌ అణు ఒప్పందంపై సంతకం చేసింది. ఆ ఒప్పందానికి అనుగుణంగానే 2019లో హెవీ వాటర్‌ రియాక్టర్‌ సెకండరీ సర్క్యూట్‌ ను ప్రారంభించింది. అప్పట్లో ఈ అరాక్‌ రియాక్టర్‌ ను రీ-డిజైన్‌ చేసేందుకు ఇరాన్‌ కు బ్రిటన్‌ సాయం చేసింది. ప్లూటోనియం ఉత్పత్తిని పరిమితం చేసేలా దీన్ని పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరిగాయి.

అయితే, ఇరాన్‌ మాత్రం దీనికి విరుద్ధంగా ప్లూటోనియం ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ కార్యక్రమాలపై ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ఇన్‌ స్పెక్టర్ల నిఘా ఉంటుంది.. కానీ, ఇరాన్‌ వీరిపై ఆంక్షలు విధించడంతో.. దీని సామర్థ్యాలపై అంచనాల్లేకుండా పోయాయని వెల్లడించిన ఐఏఈఏ... ఇరాన్ చేసే ఫుల్టోనియం ఉత్పత్తి, నిల్వలపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంది. దీంతో.. ఐడీఎఫ్ దాడులు షురూ చేసింది.