ఇజ్రాయెల్ - పాకిస్థాన్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం: దౌత్యరంగంలో పెను ప్రకంపనలు
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
By: A.N.Kumar | 10 April 2026 1:15 PM ISTమధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో మరో కొత్త రగడ మొదలైంది. ఇప్పటివరకు తెర వెనుక ఉన్న విభేదాలు కాస్తా ఇప్పుడు బాహాటంగా ఇజ్రాయెల్ , పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
వివాదానికి కారణం: ఖవాజా ఆసిఫ్ 'ఎక్స్' పోస్ట్
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్‌ను "మానవాళికి శాపం" అని సంబోధిస్తూ ఆ దేశాన్ని ఒక "క్యాన్సర్" తో పోల్చారు. గాజాలో మొదలైన హింస ఇప్పుడు లెబనాన్, ఇరాన్ వరకు పాకిందని అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకోవడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా అసలు పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడటమే ఒక చారిత్రక తప్పిదమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో పరిస్థితిని గమనించిన ఖవాజా ఆసిఫ్ ఆ పోస్టును తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. "డిలీట్ చేసినా లొల్లి ఆగలేదు" అన్న చందంగా ఇజ్రాయెల్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఇజ్రాయెల్ దీటైన సమాధానం
పాకిస్థాన్ మంత్రుల వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఒక సార్వభౌమ దేశం అంతం కావాలని కోరుకోవడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సర్ స్పందిస్తూ.. "ఒక దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చడం ద్వేషపూరిత ప్రసంగం కిందికే వస్తుంది. ఇది అంతర్జాతీయ సంబంధాల నైతికతకు విరుద్ధం" అని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతీయ శాంతిని దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు.
దౌత్యపరమైన ఇబ్బందులు.. పాకిస్థాన్ చిక్కుల్లో పడిందా?
ఈ వివాదం కేవలం రెండు దేశాల మధ్య వాగ్వాదానికే పరిమితం కాకుండా పాకిస్థాన్ దౌత్య ప్రయోజనాలపై దెబ్బకొట్టేలా కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కీలకమైన చర్చలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఒక పక్షం వహించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పాకిస్థాన్ యొక్క 'తటస్థ' పాత్ర ప్రశ్నార్థకమైంది. ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన అమెరికా పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇది పాకిస్థాన్‌కు అందే ఆర్థిక, సైనిక సహాయాలపై ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు ఇలాంటి వివాదాల ద్వారా అంతర్జాతీయంగా ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ , పాకిస్థాన్ మధ్య అధికారికంగా దౌత్య సంబంధాలు లేనప్పటికీ గతంలో తెరవెనుక కొన్ని చర్చలు జరిగాయన్న వార్తలు ఉన్నాయి. కానీ తాజా పరిణామాలు ఆ అవకాశాలను పూర్తిగా మూసివేసినట్లు కనిపిస్తోంది. ఖవాజా ఆసిఫ్ పోస్ట్ డిలీట్ చేసినా ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా లేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముదురుతున్న వేళ ఈ కొత్త వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
