ఇరాన్ పై భీకరదాడులు.. అసలు షాకింగ్ రీజన్ చెప్పిన నెతన్యాహు!
పశ్చిమాసియా మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులతో రగులుతోంది. ఏ క్షణం ఏమి జరగబోతోందనే టెన్షన్స్ నడుమ ఇరాన్ కు ఇజ్రాయేల్ ఊహించని రీతిలో వరుస షాకులిచ్చింది.
By: Tupaki Desk | 13 Jun 2025 12:33 PM ISTపశ్చిమాసియా మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులతో రగులుతోంది. ఏ క్షణం ఏమి జరగబోతోందనే టెన్షన్స్ నడుమ ఇరాన్ కు ఇజ్రాయేల్ ఊహించని రీతిలో వరుస షాకులిచ్చింది. ఇందులో భాగంగా... ఇరాన్ అణుకర్మాగారం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటనలు చేశారు.
అవును... ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన నెతన్యాహు... ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు "ఆపరేషన్ రైజింగ్ లయన్" ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశామని అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకు చేపట్టిన సైనిక చర్య "ఆపరేషన్ రైజింగ్ లయన్" తమ సైన్యం ప్రారంభించిందని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ టెహ్రాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోందని.. ఈ ముప్పును పూర్తిగా తొలగించేవరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. ఇందులో భాగంగా అధిక మొత్తంలో శుద్ధిచేసిన యురేనియంను ఉత్పత్తి చేస్తుందని.. దీంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయొచ్చని వెల్లడించిన నెతన్యాహు... ఇప్పుడే దాన్ని ఆపకపోతే ఇజ్రాయెల్ కు పెను ప్రమాదంగా పరిణమిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా... నాజీ హోలోకాస్ట్ నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని.. మరోసారి తాము బాధితులుగా మిగలాలని అనుకోవట్లేదని.. అందుకే వారి బెదిరింపులకు తాము ప్రతిచర్య చేపట్టామని చెప్పిన నెతన్యాహు... ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి గుండెలాంటి ప్రాంతాలపై తాము దెబ్బకొట్టామని.. నంతాజ్ లోని అణు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే.. మిత్ర దేశాలతో కలిసి తమను నాశనం చేయాలనే ఇరాన్ ఆటలు సాగనివ్వమని.. అందుకే ఈ దాడులు చేస్తున్నామని తెలిపారు. అయితే.. తమ దాడులు పూర్తిగా ఇరాన్ నియంతృత్వంపైనే తప్ప అక్కడి ప్రజలపై మాత్రం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు.
