Begin typing your search above and press return to search.

కష్టకాలంలో కలుగుల్లో దాక్కొన్న తమ్ముళ్లు... అలా ఒంటరైన ఇరాన్!

ఇరాన్‌ చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Jun 2025 4:00 AM IST
కష్టకాలంలో కలుగుల్లో దాక్కొన్న తమ్ముళ్లు... అలా ఒంటరైన ఇరాన్!
X

ఇరాన్‌ చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులతో టెహ్రాన్‌ లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఐడీఎఫ్ దళాలు అవిరామంగా దాడులు చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లో సుమారు 600 మందికి పైగా మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

మరోవైపు తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం లేదన్న ఆగ్రహంతో ఉన్న అగ్రరాజ్యం కూడా ఇరాన్‌ పై నేడో, రేపో యుద్ధానికి దిగబోతోందని అంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. పైగా.. అమెరికాకు చెందిన 'డూమ్స్ డే' విమానాలలో ఒకటైన బోయింగ్ 'ఈ-4బీ నైట్ వాచ్' వాషింగ్టన్ సమీపంలోని మేరీల్యాండ్‌ లో ల్యాండ్ అవ్వడంతో ఆ చర్చకు మరింత బలం చేకూరింది.

ఈ క్రమంలో ఇరాన్‌ రాజకీయ నాయకత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని.. చాలా మంది నియంతలకు పట్టిన గతే ఖమేనీకి పడుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇంత జరుగుతున్నా.. ఇన్నాళ్లూ ఇరాన్‌ పెంచి పోషించిన హమాస్‌, హెజ్‌ బొల్లా, హూతీలు లాంటి ముసుగు సంస్థలు మినుక్కుమని కూడా అనకపోవడం, పూర్తి మౌనం వహించినట్లు కనిపించడం ఆశ్చర్యం కలిస్తోంది! ఈ సమయంలో వారంతా ఎక్కడ అనే చర్చ మొదలైంది.

గాజాలో హమాస్!:

పాలస్తీనాలో స్వయం ప్రకటిత రాజుగా వెలిగిన మిలిటెంట్ గ్రూప్ హమాస్.. రెండేళ్ల క్రితం చేసిన ఓ పనికి పూర్తి స్థాయిలో ప్రతిఫలం అనుభవించేసింది! రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్‌ లో పౌరులపై ఊచకోత కోసి జీవిత కాలానికి సరిపడా తప్పు చేసేసిన హమాస్... ఆ మరుసటి రోజు నుంచి ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో ఉక్కిరిబిక్కిరై, చివరికి నామరూపాల్లేకుండా పోయింది. కనీసం ఆ పేరు కూడా వినిపించని స్థాయిలో పతనమైపోయింది!

ఇక ఆ సంస్థకు చెందిన అగ్రనేతలు హనియే, సిన్వర్‌ లను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుబెట్టడంతో పాటు.. వీరి రాజ్యంగా చెప్పుకున్న గాజా ప్రాంతాన్ని కాంక్రీట్ శిథిలాల నిలయంగా మార్చేసింది. ఏమాత్రం రూపురేకలు లేకుండా చెరిపేసింది. దీంతో... ఈ సమయంలో హమాస్‌ ను ముందుండి నడిపించాల్సిన నేత ఖలీద్.. ఖతార్‌ కు పారిపోయాడు. దీంతో నాయకత్వ లేమితో హమాస్‌ ఇబ్బంది పడుతోంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ పైకి దూకే సాహసం చేస్తుందని అనుకోలేం!

లెబనాన్ లో హెజ్ బొల్లా!:

ఇరాన్ కు నమ్మిన బంటుగా పేరున్న హెజ్ బొల్లా... లెబనాన్ లో అత్యంత శక్తివంతమైన గ్రూపుగా ఓ వెలుగు వెలిగింది. అయితే.. ఐడీఎఫ్ దళాలు హమాస్‌ పై దాడికి దిగిన సమయంలో.. ఇరాన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై క్షిపణి దాడులకు దిగింది. దీంతో... ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది! దీని మనుగడ కూడా ప్రశ్నార్థకమే అనే మాటలు వినిపిస్తున్నాయి.

హెజ్ బొల్లా అగ్రనేత హసన్‌ నస్రల్లాను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుబెట్టింది. దీంతో ఆ సంస్థ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మరోవైపు హెజ్ బొల్లా ప్రస్తుత అగ్రనేత నయీమ్‌ ఖాసిమ్‌.. ఇరాన్‌ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయెల్ పైకి హెజ్ బొల్లా కాలు దువ్వే సాహసం చేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటున్నారు.

ఇరాక్ లో మిలీషియాలు!:

ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు.. వాటిని ఖండిస్తున్నట్లు, వ్యతిరేకిస్తున్నట్లు మాత్రమే స్పందించిన ఇరాక్‌ లోని షియా మిలీషియాలు.. అక్కడి అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, ఇరాన్‌ ప్రయోజనాలను కాపాడేవారు. కానీ, ప్రస్తుతం అమెరికా నేరుగా ఇరాన్‌ పైనే దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

కొద్దో గొప్పో ఆశలు హౌతీల పైనే!:

ఇరాన్‌ పెంచి పోషించిన సంస్థల్లో ప్రస్తుతం ఆ దేశానికి కాస్త మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపిస్తున్నవారిలో మిగిలింది హూతీలే. వీరు అమెరికా, ఇజ్రాయెల్‌ కు వ్యతిరేకంగా పని చేస్తున్నప్పటికీ.. వారు కూడా ఆత్మరక్షణలో పడ్డారని అంటున్నారు. దానికి కారణం... మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వీరికి చెందిన పలు క్షిపణులను అమెరికా నేల కూల్చింది.

దీంతో.. ఇప్పుడు నేరుగా అమెరికాపైకి, అమెరికా మద్దతు ఇస్తున్న ఇజ్రాయెల్ పైకి కాలు దువ్వడం అంటే అది ఆత్మహత్యా సదృశ్యం అనే భావన వీరిలో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ కు వీరి మద్దతు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది తప్ప చేతల్లో కనిపించడం లేదని అంటున్నారు.