టార్గెట్ ఖమేనీ... ప్రసంగం అవ్వగానే పని మొదలుపెట్టిన ఐడీఎఫ్!
ఖమేనీని అంతమొందిస్తే.. యుద్ధం ముగిసినట్లే అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 10:28 PM ISTఖమేనీని అంతమొందిస్తే.. యుద్ధం ముగిసినట్లే అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఖమేనీ ఎక్కడున్నారో అమెరికాకు తెలుసని, అయితే ఆయను ఇప్పుడు చంపాలనుకోవడంలేదని ట్రంప్ అన్నారు. సరిగ్గా ఈ సమయంలో... లావిజాన్ ప్రాంతంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది.
అవును... ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ బుధవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే... టీవీలో ప్రత్యక్ష ప్రసారం ప్రసంగం ముగిసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహ్రాన్ లోని లావిజాన్ ప్రాంతంపై దాడి ప్రారంభించాయి. ఎందుకంటే... లావిజాన్ ను ఖమేనీ రహస్య స్థావరంగా చెబుతారు. అతను కుటుంబంతో సహా అక్కడే ఉన్నాడని చెబుతున్నారు!
ఇలా దాడి జరిగిన సమయాన్ని బట్టి.. ఇజ్రాయెల్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుందనే ఊహాగానాలు మొదలైపోయాయి. పైగా ఖమేనీ లావిజాన్ లోనే ఉన్నట్లు స్థానిక మీడియాలోనే కథనాలొచ్చిన పరిస్థితి. అయితే... ఈ దాడి గురించి అటు ఇజ్రాయెల్ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ ధృవీకరణ లేదు. కానీ.. ఈ సంఘటన వాతావరణాన్ని మరింత వేడెక్కించిందని చెబుతున్నారు.
ఇక... బుధవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఖమేనీ... ఇరాన్ ప్రజలు తమ అమరవీరుల రక్తాన్ని ఎప్పటికీ మరచిపోరని.. దేశ గగనతలాన్ని ఉల్లంఘించిన వారిని క్షమించబోమని చెప్పారు. అమెరికా లేదా మరే ఇతర శక్తి ఇరాన్ పై సైనిక చర్య తీసుకుంటే, అది కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని.. ఇస్లామిక్ రిపబ్లిక్ శత్రువులను హెచ్చరించారు.
ఇదే సమయంలో... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపులను హాస్యాస్పద ప్రకటనగా కొట్టిపారేసిన ఖమేనీ... ఇరాన్ బెదిరింపు భాషను సహించదని.. అది యుద్ధంలో లొంగిపోదని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే.. కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికా పౌరులు తెలుసుకోవాలని అన్నారు.
ఇదే క్రమంలో.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని మూర్ఖపు చర్యగా అభివర్ణించిన ఖమేనీ... ఇది మొత్తం ఇరాన్ ప్రజల సహనాన్ని పరీక్షించడం లాంటిదని అన్నారు. ఇరాన్ ఎప్పుడూ ఎలాంటి బలవంతానికి తలొగ్గదని.. ఈ దేశం ఆధ్యాత్మికంగా, హేతుబద్ధంగా పరిణితి చెందిందని తెలిపారు.
