ఖమేనీని ఫినిష్ చేయాలని వెతికాం కానీ... ఇజ్రాయెల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఖమేనీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Jun 2025 11:32 AM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయంలో స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఖమేనీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఖమేనీని హతమారిస్తే యుద్ధం ముగిసినట్లేనని అన్నారు. ఈ సమయంలో.. ఆ దేశ రక్షణమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమారిస్తే యుద్ధం ముగిసినట్లేనంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇరాన్ సుప్రీంలీడర్ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసని.. ఆయనను హతమార్చడం పెద్ద పని కాదని.. అయితే, ప్రస్తుతం ఆయన్ను చంపబోవడం లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అసలు అది తమ ఉద్దేశ్యం కాదని అన్నారు.
అయితే... అసలు విషయం ఏమిటో తాజాగా చెప్పారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్! స్థానిక మీడియా ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖట్జ్... ఇటీవల ఇరాన్ తో ఘర్షణల సమయంలో ఆ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా గాలించామని అన్నారు. అయితే.. తమకు సరైన అవకాశం లభించకపోవడంతో అందులో విఫలమైనట్లు వెల్లడించారు.
ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో.. తాము హత్య ప్రణాళికను రద్దు చేసుకొన్నామని.. ఆయన మాకు అందుబాటులోకి వస్తే.. ఆయన్ను బయటకు తెచ్చేవాళ్లమని.. ఆయన కోసం తీవ్రంగా గాలించామని ఖట్జ్ తెలిపారు. దీంతో... టెహ్రాన్ నాయకత్వాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొన్నట్లు తొలిసారి అధికారికంగా ధ్రువీకరణ అయినట్లయ్యిందని అంటున్నారు.
కాగా... ఇజ్రాయెల్ తో యుద్ధం మొదలైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ.. గురువారం తొలిసారి స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఖతార్ లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యం ముఖంపై పిడిగుద్దులు గుద్దామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
