టెల్ అవీవ్ కు కొత్త బలం... ఇజ్రాయెల్ టు ఇరాన్ వయా సిరియా!
ఇప్పటికే టెహ్రాన్ పై టెల్ అవీవ్ నిప్పుల వర్షం కురిపిస్తోన్న వేళ ఇరాన్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 16 Jun 2025 4:26 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఏ లక్ష్యంతో అయితే యుద్ధం ప్రారంభించిందో.. ఇజ్రాయెల్ ఆ పని దాదాపు పూర్తి చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఇరాన్లోని అణు స్థావరాలతో పాటు అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టింది.
ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్).. ఇరాన్ వ్యాప్తంగా సుమారు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో.. వాషింగ్టన్ కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ స్పందిస్తు... ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికిపైగా గాయాలపాలయ్యారని పేర్కొంది.
ప్రధానంగా... ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. చమురు, సహజ వాయు క్షేత్రాలపైనే గురిపెట్టింది. ఈ క్రమంలో.. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు క్షేత్రమైన 'సౌత్ పార్స్' పైనా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. ఇరాన్ కు మరింత కష్టాలు తెచ్చే ఓ బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ కు బలం పెరుగుతోంది!
అవును... ఇప్పటికే టెహ్రాన్ పై టెల్ అవీవ్ నిప్పుల వర్షం కురిపిస్తోన్న వేళ ఇరాన్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్ ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో.. ఇప్పటికే పశ్చిమాసియాలో మొహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌకల నుంచి ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తూ.. ఇరాన్ క్షిపణులను పేల్చేస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా... యుఎస్ యుద్ధనౌకల్లో ఆర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్లు.. ఇజ్రాయెల్ కు దగ్గరగా, మధ్యధరా సముద్రంలో మోహరించాయి. ఈ నౌకలు ఎస్ఎం-3 వంటి అధునాతన క్షిపణులను కలిగి ఉంటాయి. ఇవి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు. వాస్తవానికి ఈ విషయాన్ని ఇరాన్ మొదట నుంచీ ఆరోపిస్తుంది. అయితే.. తాజాగా వాటికి సంబంధించిన సాక్ష్యాలు తెరపైకి వచ్చాయి!
ఇలా డిఫెన్స్ విషయంలో ఇజ్రాయెల్ కు అమెరికా సహకరిస్తుండగా.. ఎఫెన్స్ విషయంలో సిరియా సహకరిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగిన సిరియా.. ఇరాన్ కు వ్యతిరేకంగా దాడులకు ప్లాన్ చేస్తోందట. దీంతో.. ఇప్పుడు ఇజ్రాయెల్ జెట్ ఫైటర్లు సిరియా మీదుగానే ఇరాన్ ను టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు.
