ఖమేనీకి సద్దాం హుస్సేన్ పరిస్థితేనా... కట్జ్ సంచలన వ్యాఖ్యలు!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఒకరిపై ఒకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నారు.
By: Tupaki Desk | 18 Jun 2025 4:00 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. ఒకరిపై ఒకరు క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నారు. అయితే.. ఈ యుద్ధంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తూనే ఉందనే చర్చ జరుగుతోంది. పైగా ఐదో రోజు ముగిసేలోపు ఈ యుద్ధంలోకి ఇజ్రాయెల్ తరుపున అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
దీనికి కారణం తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను తాను కోరుకోవడం లేదని.. అయితే, ఇరాన్ అణు సమస్యకు 'నిజమైన ముగింపు' ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో.. జీ7 సదస్సు నుంచి ఆగమేఘాల మీద అమెరికాకు బయలుదేరిన సమయంలో సోషల్ మీడియా వేదికగాను సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. తాను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఫ్రాన్స్ అధ్యక్షుడికి తెలియదని.. కాల్పుల విరమణ గురించి కాదని.. అంతకంటే 'పెద్దదే' జరగబోతోందని ట్రూత్ లో వెల్లడించారు. దీంతో.. అమెరికా ఎంట్రీ కన్ఫా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 2003లో అమెరికా దళాలకు పట్టుబడిన ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను గుర్తు చేశారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్.
అవును... తమ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టెహ్రాన్ తగిన మూల్యం చెలించుకోక తప్పదని పలుమార్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన కట్జ్... ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో టెహ్రాన్ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఈ సందర్భంగా స్పందించిన కట్జ్... మా పౌరులపై క్షిపణి దాడులు చేస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇరాన్ పాలకులను హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని ఎంచుకున్న ఇరాక్ నియంతకు ఏం జరిగిందో గుర్తించుకోవాలని హెచ్చరించారు.
కాగా... ఓ ఫామ్ హౌస్ అండర్ గ్రౌండ్ లో తలదాచుకున్న ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను అమెరికా దళాలు 2003లో పట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం 2006లో ఆయనకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ నేపథ్యంలో.. ఆ విషయాన్ని ఖమేనీకి గుర్తు చేస్తున్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి.
