Begin typing your search above and press return to search.

ఏమిటీ ట్రంప్ 'సిట్యువేషన్ రూమ్'.. ఇది ఎక్కడుంది?

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోన్న వేళ.. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి ముందుగానే ఆగమేఘాల మీద అమెరికా బయలుదేరారు ట్రంప్.

By:  Tupaki Desk   |   18 Jun 2025 10:40 AM IST
ఏమిటీ ట్రంప్  సిట్యువేషన్ రూమ్.. ఇది ఎక్కడుంది?
X

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ అయినా, చేయిస్తోంది అమెరికా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి శత్రువు పైకి తొలుత స్నేహితుడిని ట్రంప్ వదిలారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకీ తీవ్రమవుతోన్న వేళ ట్రంప్ 'సిట్యువేషన్ రూమ్' మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోన్న వేళ.. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి ముందుగానే ఆగమేఘాల మీద అమెరికా బయలుదేరారు ట్రంప్. ఈ సందర్భంగా.. తన కోసం సిట్యువేషన్ రూమ్ వద్ద వేచి ఉండమని జాతీయ భద్రతా మండలిని ఆదేశించారు. దీంతో.. ఏమిటా సిట్యువేషన్ రూమ్ అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ గదిని 1961లో ఏర్పాటు చేశారు. దీనిని అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ ప్రారంభించారు. క్యూబాలోకి అమెరికా కొన్ని అసమ్మతివాద సాయుధ మూకల్ని పంపించి ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చేసిన ప్రయత్నాన్ని కెన్నడీ ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. అనంతరం అనేకసార్లు ఈ గదిని ఉపయోగించారు.

1961 క్యూబా సంక్షోభంతో పాటు 9/11 దాడుల తర్వాత ప్లానింగ్ కూడా ఇక్కడ నుంచే జరిగింది. 2011లో ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా సైన్యం.. పాకిస్థాన్ లో మట్టుబెట్టిన ఆపరేషన్ ను ఒమాబా ఇక్కడ నుంచే పర్యవేక్షించారు. 2020లో ఐసిస్‌ ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బగ్దాదిని సిరియాలో అమెరికా దళాలు మట్టుపెట్టిన ఆపరేషన్‌ ను ట్రంప్‌ నేరుగా పర్యవేక్షించారు.

వైట్ హౌస్ లోని వెస్ట్ వింగ్ బేస్ మెంట్ లో ఉంది ఈ గది. సుమారు 5,525 చదరపూ అడుగుల విస్తీర్ణమున్న ఈ గదిలో కాన్ఫరెన్స్ రూమ్.. నిఘా నిర్వాహక కేంద్రం ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు, ఆయన సలహాదారులు.. దేశం లోపల, బయట సంక్షోభాలు నెలకొన్నప్పుడు వాటిని సమీక్షించడానికి ఇక్కడ సమావేశమవుతారు.

అయితే 1961లో దీన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచీ అత్యధిక సార్లు లిండన్ బి జాన్సన్ ఉపయోగించారని చెబుతారు. వియాత్నాం యుద్ధంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఈ గదిలో నిత్యం సమావేశాలు నిర్వహించేవారు.