Begin typing your search above and press return to search.

అయ్యో... ప్రధాని కుమారుడి పెళ్లి ఆపిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం!

ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో వాతావరణం మూడు క్షిపణులు, ఆరు డ్రోన్లు అన్నట్లుగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 6:19 PM IST
అయ్యో... ప్రధాని కుమారుడి పెళ్లి ఆపిన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రత మరింత పెరుగుతోంది. దీంతో పశ్చిమాసియాలో భయానక వాతావరణం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు హల్ చల్ చేస్తున్నాయి. గాజా, ఇరాన్ లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు టెల్ అవీవ్ పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ సమయంలో ప్రధాని కుమారుడి పెళ్లి ఆగిపోయింది!

అవును.. ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో వాతావరణం మూడు క్షిపణులు, ఆరు డ్రోన్లు అన్నట్లుగా మారిపోయింది. తొలుత వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఇరాన్ ని ఇజ్రాయెల్ ముచ్చెమటలు పట్టించేస్తుందని భావించినా, అదే జరుగుతున్నా.. మరోవైపు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్ పై వరుసగా సుమారు 100కు పైగా క్షిపణులను ప్రయోగించింది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. తన కుమారుడి వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తన కుమారుడి వివాహ వేడుకను వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాల మధ్య నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారూ ఆవ్ నర్ కు అమిత్ యార్దేనీకి మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. ఈ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఆయన కుటుంబం సిద్ధమైంది. అయితే... ప్రస్తుతం ఇరాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. టెల్ అవీవ్ లోనూ చోటు చేసుకున్న, చేసుకుంటున్న పరిణామల నేపథ్యంలో ప్రధాని ఫ్యామిలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఓ పక్క దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే.. రాజధాని ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని శత్రుసైన్యం క్షిపణులను ప్రయోగిస్తుంటే.. ఫలితంగా దేశంలో అమాయక ప్రజల ప్రాణాలు పోతుంటే.. ప్రధాని ఇంట వివాహ వేడుకలా అనే కామెంట్లూ వినిపిస్తుండటం కూడా నెతన్యాహు తాజ నిర్ణయానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చని అంటున్నారు.