ఇరాన్ 3 రకాల ప్రణాళికలు... ఆ ముగ్గురిని గుర్తుచేస్తున్న ఇజ్రాయేలీలు!
పశ్చిమాసియాలో భారీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య క్షిపణుల వర్షం, డ్రోన్ల తుఫాను నడుస్తోంది.
By: Tupaki Desk | 14 Jun 2025 10:30 AM ISTపశ్చిమాసియాలో భారీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య క్షిపణుల వర్షం, డ్రోన్ల తుఫాను నడుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కు మద్ధతుగా అమెరికా తన సహాకారాన్ని అందిస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ ను నాశనం చేయాలని ఇరాన్ 3 రకాల ప్రణాళికలు రచించుకుందని చెబుతూ వాటివి వివరించారు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. ఈ సందర్భంగా ఇరాన్ ముగ్గురు నేతలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.
అవును.. ప్రస్తుతం ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ సమయంలో.. అణ్వాయుధాన్ని సంపాదించాలనే తపనను వదులుకుని.. శాంతియుత భవిష్యత్తును సాధించడానికి పవిత్రమైన చేతులతో ముందుకు రావడం తప్ప ఇరాన్ కు మరో మార్గం లేదని రూవెన్ అజార్ అన్నారు. అలా చేయడంలో విఫలమైతే ఇస్లామిక్ దేశానికి విపత్కర ఫలితాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరాన్ 3 ప్రణాళికలను వివరించారు.
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ మనుగడకు ముప్పు కలిగించడానికి ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించడానికి కొన్ని దశాబ్ధాలుగా తీవ్ర ప్రయత్నం చేస్తుందని. అయితే.. తాజాగా ఆ ప్రయత్నాన్ని తాము విఫలం చేశామని రూబెన్ అన్నారు.
ఇక రెండో ప్రయత్నంగా.. బాలిస్టిక్ క్షిపణులను భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో రాబోయే 3 ఏళ్లలో సుమారు 10,000 బాలిస్టిక్ క్షిపణులను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఇదే క్రమంలో రాబోయే ఆరేళ్లలో 20,000 బాలిస్టిక్ క్షిపణులను నిర్మించాలని ప్లాన్ వేస్తున్నారని ఆయన తెలిపారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే.. అణ్వాయుధం లేకపోయినా ప్రతీ బాలిస్టిక్ క్షిపణి సుమారు 1,000 కేజీల అత్యంత పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవని తెలిపారు. వాటిని పేల్చితే అది ఒక్కోటి ఒకేసారి వందలాది మందిని చంపగలదని వివరించారు. ఇజ్రాయెల్ వంటి చిన్న ప్రాంతాలకు ఇది భారీ డ్యామేజ్ ని కలిగిస్తాయని అన్నారు.
ఇక వారి మూడో ప్రణాళికలో... హమాస్, హిజ్బుల్లా, సిరియా, ఇరాక్, యెమెన్ లోని మిలీషియాల వంటి ప్రాక్సీలకు ఆయుధాలు, సహాయం చేయదం ద్వారా ఇజ్రాయెల్ చుట్టూ అగ్ని వలయం సృష్టిస్తున్నారని వివరించారు. అందువల్ల తాము చర్య తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఒంటరి కాదని.. తమ మిత్రదేశాలు అన్ని సమయాల్లోనూ తమతో ఉంటాయని అజార్ పేర్కొన్నారు.
ఆ ముగ్గురునీ గుర్తుంచుకోవాలి!:
ఇదే సమయంలో... ఇరాన్ చరిత్ర పుస్తకాల నుంచి కీలకమైన విషయాలు నేర్చుకోవాలని కోరిన రూవెన్ అజార్... సద్దాం హుస్సేన్ అణ్వాయుధాలను సంపాదించడానికి ప్రయత్నించాడని.. అస్సాద్ పాలనా అణ్వాయుధాలను సంపాదించడానికి ప్రయత్నించిందని.. అలాగే గడాఫీ కూడా అదే చేయడానికి ప్రయత్నించాడని.. ఫలితం ఎలాగుందో చూశాని గుర్తుచేశారు.
