పశ్చిమాసియాలో మిసైళ్ల వర్షం... భారతీయులకు కీలక సూచనలు!
ప్రస్తుతం పశ్చిమాసియాలో బాంబులమోత మోగిపోతోంది. ఇరాన్ లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.
By: Tupaki Desk | 15 Jun 2025 12:56 PM ISTప్రస్తుతం పశ్చిమాసియాలో బాంబులమోత మోగిపోతోంది. ఇరాన్ లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడులకు ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టిన ఐడీఎఫ్.. గురువారం రాత్రి నుంచి అవిరామంగా క్షిపణులు వర్షం కురిపితోంది.. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ సమయంలో భారతీయులకు కీలక సూచనలు అందాయి!
అవును.. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండటంతో పశ్చిమాసియా భీకరంగా మారిపోయింది. ఇదే సమయంలో అదే స్థాయిలో ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఈ సమయంలో తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్ అణ్వాయుధ డిపోలు, సైనిక స్థావరాలు ధ్వంసం అయినట్లు స్థానిక మీడియా పేర్కొంది!
ఇదే సమయంలో.. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై మిస్సైళ్లను సంధించింది ఇజ్రాయెల్. ఈ సందర్భంగా స్పందించిన ఐడీఎఫ్... టెహ్రాన్ లోని ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్ట్ పై వరుస దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, ఎస్.పీ.ఎన్.డీ న్యూక్లియర్ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్ పై దాడులు చేసినట్లు ఎక్స్ లో వెల్లడించింది.
అదేవిధంగా... ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో టెహ్రాన్ లోని ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్టులో భాగమైన 9 మంది సీనియర్ శాస్త్రవేత్తలను హతం చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ పై దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. ఇక జూన్ 13న జరిపిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా 329 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
భారతీయులకు కీలక సూచనలు!:
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యలో.. ఆయా దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. దీంతో.. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లోని భారత రాయబార కార్యాలయంలో మన పౌరుల కోసం 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ ఏర్పాటుచేశారు. ఈ మేరకు టెల్ అవీవ్ లోని రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా... అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని.. అత్యవసర పరిస్థితి తలెత్తితే సాయం కోసం సంప్రదించడానికి హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చని.. లేదా, ఈ-మెయిల్ పంపించవచ్చని తెలిపింది. ఇదే సమయంలో... ఇజ్రాయెల్ తో పాటు పాలస్తీనాల్లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం కోరింది.
