Begin typing your search above and press return to search.

యుద్ధంలో మృతులపై యూఎస్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుల లెక్క ఇదే!

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరుకుంటోంది. ఇరు దేశాల మధ్య క్షిపణుల వర్షం కురుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 11:27 AM IST
యుద్ధంలో మృతులపై యూఎస్  హ్యూమన్  రైట్స్  యాక్టివిస్టుల  లెక్క ఇదే!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరుకుంటోంది. ఇరు దేశాల మధ్య క్షిపణుల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా అణు కేంద్రాలు, చమురు క్షేత్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ లోని జనావాసాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ లో అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే... ఇజ్రాయెల్ లో జనావాసాలపై ఇరాన్ క్షిపణులు పడుతున్నాయి. ఈ సమయంలో... ఇరాన్‌ అణుకేంద్రాలు లక్ష్యంగా బుధవారం ఇజ్రాయెల్‌ తన దాడులను తీవ్రతరం చేసింది.

ఇందులో భాగంగా... టెహ్రాన్‌ కు సమీపంలో యురేనియం సెంట్రిఫ్యూజ్‌ లు తయారు చేసే కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ధ్రువీకరించింది. ఈ సందర్భంగా స్పందించిన ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీ డెఫ్రిన్‌.. ఇప్పటివరకు ఇరాన్‌ లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ గగనతలంపై తాము నియంత్రణ సాధించినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫతాహ్-1 హైపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించామని పేర్కొంది. అదేవిధంగా.. తమ దాడుల్లో ఇజ్రాయెల్‌ లో 24 మంది మృతి చెందారని.. వందల మంది గాయపడ్డారని వివరించింది.

ఈ సందర్భంగా స్పందించిన అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు.. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ కారణంగా ఇరాన్ లో ఇప్పటివరకూ 639 మంది మరణించారని వెల్లడించారు. అయితే... తమ పౌరులు 236 మంది మాత్రమే మరణించారని ఇరాన్ చెబుతోంది. మరోవైపు గాజాలోనూ ఐడీఎఫ్ దాడులు కొనసాగుతున్నాయని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ సైన్యం దాడుల కారణంగా గత 24 గంటల్లో 144 మృతదేహాలను ఆసుపత్రులకు తీసుకువచ్చారని హమాస్ చెబుతోంది! మరోవైపు.. ఖాన్ యూనిస్ సమీపంలో ఆహార సహాయం కోసం వేచి ఉన్న పాలస్తీనియన్ల గుంపుపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపిన ఘటనలో మృతుల సంఖ్య 70కు చేరిందని వెల్లడించింది!