ఆ ముగ్గురు మొండిఘటాలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా?
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం పదో రోజులోకి ప్రవేశించింది. రోజురోజుకీ అత్యంత ఉద్రిక్తంగా మారుతోన్న ఈ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది.
By: Tupaki Desk | 22 Jun 2025 10:41 AM ISTఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం పదో రోజులోకి ప్రవేశించింది. రోజురోజుకీ అత్యంత ఉద్రిక్తంగా మారుతోన్న ఈ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. పౌర విమానాలు తిరగాల్సిన గగనతలంలో.. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా యుద్ధంలోకి అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనని అంటున్నారు పరిశీలకులు.
అవును... ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. వాటివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఆ దేశంలోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కారణం చెప్పి.. ఇరాన్ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని అణుస్థావరాలపై ఏమాత్రం సమాచారం ఉన్నా వెంటనే అక్కడ ఇజ్రాయెల్ క్షిపణులు వాలిపోతున్నాయి.
ఈ క్రమంలో.. తాజాగా అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ తో అమెరికా జట్టుకడితే.. ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటాం అంటూ హూతీ నుంచి హెచ్చరికలు జారీ చేసిన అనంతరం.. యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించిన తర్వాత యూఎస్ ఈ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.
వాస్తవానికి వారంతంలోనే ఇరాన్ పై అమెరికా దాడి ఉండొచ్చని కథనాలొచ్చాయి. అయితే.. వాటిని నమ్మిన వారిని తప్పుదోవపట్టించడానికో ఏమో కానీ... ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వెళ్లడించింది. ఆ ప్రకటన వెలువడిన 48 గంటల్లోనే.. ఇరాన్ లోని అణుస్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. ఈ విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా దూకుడు మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేపిందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గురు మోడిఘటాలు వెనక్కి తగ్గకపోవచ్చని చెబుతున్నారు. తమ పౌరులను ఊచకోత కోసిన హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా ఇజ్రాయెల్.. గాజాను ఏమి చేసిందో, చేస్తూ ఉందో ప్రపంచం మొత్తం చూసింది, చూస్తోంది. తన శత్రువుల విషయంలో ఇజ్రాయెల్ రివేంజ్ ఆ స్థాయిలో ఉంటుంది.
ప్రస్తుతం పాలస్థీనా వాసులు గాజాలో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు.. బ్రెడ్ స్థానంలో ఇసుక తింటున్నామని అక్కడ ప్రజలు వాపోతున్న పరిస్థితి. పైగా.. ఆహార వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారిపైనా ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయనే విషయం.. ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో.. ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతుందని అనుకోలేని పరిస్థితి!
మరోవైపు సుదీర్ఘ కాలం యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి వెల్లడించారు. ఖమేనీని అంతమొందిస్తేనే యుద్ధం ముగిసినట్లు అని నెతన్యాహు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో... ఇజ్రాయెల్ తరుపున అయితే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందనేది చెప్పడం దాదాపు కష్టమని అంటున్నారు.
ఇదే సమయంలో.. తాము లొంగిపోయేది లేదు, అస్సలు తగ్గేది లేదు, ఇరాన్ గురించి తెలిసినవారు ఎవరూ తక్కువ అంచనా వేయరు అన్నట్లుగా ట్రంప్ హెచ్చరికల వేళ ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ వ్యాఖ్యానించిన పరిస్థితి. మరోపక్క.. ఇరాన్ కు అవసరమైతే తాను మద్దతుగా నిలుస్తామంటూ రష్యా ప్రకటించిన వేళ.. ఇక టెహ్రాన్ తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు.
ఇలా ఇద్దరు మొండి ఘటాల పరిస్థితి ఉంటే... అంతకంటే మొండిఘటం ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచానికి రెండు వారాల సమయం అని చెప్పి.. రెండు రోజుల్లో ఇరాన్ పై కీలక దాడి చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఇరాన్ లోని అత్యంత కీలకమైన అణు స్థావరాలపై దాడి చేశారు. పైగా.. మిషన్ సక్సెస్ అయ్యిందని, ఇది శాంతి చర్చలకు సరైన సమయం అని చెబుతున్నారు. మాట వినకపోతే మరిన్ని దాడులు అని హెచ్చరిస్తున్నారు.
ఇక ఇరాన్ పై అమెరికా దాడుల అనంతరం.. ఎర్రసముద్రంలో హౌతీలు ఏ మేరకు తిరుగుబాటు జెండా ఎగరేస్తారనే చర్చ మొదలైంది. మరోవైపు ఇరాన్ కు చైనా ఆయుధాల సహాయం చేస్తుందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి! అటు.. ఇజ్రాయెల్ కు ఆయుధాలు సరఫరా చేసినవారిలో అమెరికాతో పాటు జర్మనీ కూడా ఉందని అంటున్నారు.
ఇలా ముగ్గురు మొండిఘటాలు, ఆరుగురు అనుకూల పరిస్థితులు కలిసి వస్తోన్న వేళ.. మూడో ప్రపంచ యుద్ధానికి తెర లేచినట్లు చెప్పొచ్చని.. దీనికి ఇంతకు మించిన సందర్భం, కారణం మరొకటి ఉండదని చెబుతున్నారు. మరి.. ఈ ఉద్రిక్త పరిణామాలు 10వ రోజుల ఎలాంటి మలుపులు తీసుకుంటాయనేది వేచి చూడాలి.
