Begin typing your search above and press return to search.

ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ సంసిద్ధం.. పశ్చిమాసియాలో పెను యుద్ధ మేఘం

ఇప్పటికే 21 నెలలు అవుతోంది హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి.. ఓవైపు ఇది కొనసాగుతుండగానే.. మరోవైపు సిరియా, ఇరాన్ లతోనూ యుద్ధం చేసింది ఓ దశలో. ఇక యెమెన్ హూతీలనూ టార్గెట్ చేసింది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 1:02 PM IST
ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ సంసిద్ధం.. పశ్చిమాసియాలో పెను యుద్ధ మేఘం
X

ఇప్పటికే 21 నెలలు అవుతోంది హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి.. ఓవైపు ఇది కొనసాగుతుండగానే.. మరోవైపు సిరియా, ఇరాన్ లతోనూ యుద్ధం చేసింది ఓ దశలో. ఇక యెమెన్ హూతీలనూ టార్గెట్ చేసింది. అయితే, కొన్నాళ్లుగా కాల్పుల విరమణ-ఆపై దాడులు ఇలా సాగుతోంది యుద్ధం.. ఇపుడు ఇరాన్ పై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి దాడికి దిగనుందనే కథనాలు వస్తున్నాయి.

వాస్తవానికి గత ఏడాది మే నెలలో ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ నేషనల్ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ)ను సిరియా రాజధాని డమాస్కస్ లో హతమార్చింది ఇజ్రాయెల్. అప్పుడే ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి బీజం పడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీదకు ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వీటిని గాల్లోనే అడ్డుకుంది. అదే సమయంలో ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే కథనాలు కూడా వచ్చాయి. కానీ, అక్కడితో ఆగిపోయింది.

తాజాగా పశ్చిమాసియాలో యుద్ధం భయాలు నెలకొన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడి చేస్తుందని .. అందుకు పూర్తిగా సిద్ధం అయిందనే కథనాలు వస్తున్నాయి. దీంతోనే ఇరాన్ సమీప సముద్ర జలాల్లో అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలూ జారీ అయ్యాయి. అమెరికా కూడా ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని భావిస్తోంది. ప్రతీకారంగా.. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి దిగుతుందని అంచనా వేస్తోంది.

ఇదంతా ఎందుకు జరుగుతోంది?

ఇరాన్ తో అమెరికా అణు చర్చలు జరుపుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధిగా స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ తో చర్చలు జరపనున్నారు. అయితే, ఇది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు ఇష్టం లేదు. మరోవైపు గాజాలో యుద్ధాన్ని ఆపాలని, ఇరాన్ పై దాడుల ప్లాన్ ను పక్కనపెట్టాలని గత సోమవారం ట్రంప్.. నెతన్యాహూను కోరారు. ఇరాన్ కు అణు ఒప్పందం చేసుకునే ఉద్దేశమే లేదని.. నెతన్యాహూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు అమెరికా-ఇరాన్ అణు చర్చలు విఫలం కాగానే.. ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి దిగుతుందని.. అందుకే ముందుగా సన్నద్ధం అయిందని భావిస్తున్నారు. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చే ఉద్దేశంలో ఉంది. ఇజ్రాయెల్ దాడికి దిగితే.. తాము విదేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఇరాక్ లో ఉన్న దౌత్య సిబ్బంది, సైనికులను వెనక్కు రావాలని ట్రంప్ కోరారు.