ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం... 12 రోజుల తర్వాత పరిస్థితి ఏమిటి?
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jun 2025 10:08 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో టెహ్రాన్ సైనిక మౌలిక సదుపాయాలను దెబ్బతీశామని.. ఇప్పటికే తమ వాయుసేన ఆ దేశంలోని 1,100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. అంతరవరకూ బాగానే ఉంది కానీ.. 12 రోజుల తర్వాత పరిస్థితి మారుతుందని అంటున్నారు.
అవును... ఇరాన్ పై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీ అణు స్థావరాలు, గ్యాస్ నిక్షేపాలు, సైనిక శిబిరాలు నేలమట్టం అవుతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. ఇదే క్రమంలో.. సుమారు 1326 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్ లో కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణులను ప్రయోగించింది. ఇదే సమయంలో తాజాగా 10 సూపర్ సోనిక్ మిస్సైల్స్ ని ప్రయోగించింది. దీంతో.. ఇరాన్ ప్రతిదాడులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగానే చెమటోడించాల్సి వస్తోంది.
ఈ సమయంలో గగన తల రక్షణ వ్యవస్థ కోసం ఇజ్రాయెల్ ఒక్క రాత్రికే ఏకంగా రూ.2400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అంచనాలు తెలిపిన అమెరికా అధికారులను ఉటంకించింది. ఇదే సమయంలో ఇజ్రాయేల్ వద్ద ఉన్న రక్షణ వ్యవస్థ ఎప్పుడు క్షీణిస్తుందనే విషయంపైనా కీలక సమాచారం తెరపైకి వచ్చింది.
వాస్తవానికి గత గురువారం రాత్రి నుంచి.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ నుంచి భారీగానే కూడా ప్రతిదాడులకు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ‘యారో సిస్టమ్’ను వినియోగిస్తున్నాయి.
వీటితో పాటు డేవిడ్స్ స్లింగ్, అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్స్, థాడ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించాయి. అయితే.. వీటి నిర్వహణ ఖర్చె ఇప్పుడు ఇజ్రాయెల్ కు తడిసి మోపడవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ రోజు రోజుకీ ఇరాన్ డోసు పెంచుతూ క్షిపణుల సంఖ్యను పెంచుతోంది.
ఇదిలాగే మరిన్ని రోజులు కొనసాగిస్తే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ప్రమాదంలో పడే అవకాశాలు కన్పిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో... అమెరికా నుంచి సరఫరా అందకపోతే.. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ 10-12 రోజుల్లోనే క్షీణిస్తుందని కథనాలొస్తున్నాయి. దీంతో.. ఇంకా 10 - 12 రోజులు ఈ యుద్ధం కొనసాగుతుందా.. లేక, ఈ లోపే యూఎస్ ఎంటరై ఫినిషింగ్ టచ్ ఇస్తుందా.. అదీగాకపోతే, ఇజ్రాయెల్ 12వ రోజు తర్వాత ఏమి చేస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
