ఇరాన్‌ను ఆపకపోతే... నెక్ట్స్ టార్గెట్ మీరే.. ఇజ్రాయెల్ సంచలన వీడియో
ప్రపంచ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసేలా ఇజ్రాయెల్ శక్తివంతమైన హెచ్చరికలు జారీ చేసింది.
By: Tupaki Desk | 17 Jun 2025 10:53 AM ISTప్రపంచ రాజకీయ వాతావరణాన్ని కుదిపేసేలా ఇజ్రాయెల్ శక్తివంతమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) ఓ వీడియో విడుదల చేసింది. అందులో "మేము ఇరాన్‌ను ఆపకపోతే, తర్వాత టార్గెట్ మీరు కావచ్చు" అని స్పష్టం చేసింది.
ఈ వీడియోలో ఇజ్రాయెల్ కొన్ని ముఖ్యమైన దేశాలను ఉద్దేశిస్తూ పేర్లు ప్రస్తావించింది. వాటిలో అమెరికా (USA), యునైటెడ్ కింగ్‌డమ్ (UK), రష్యా, ఇటలీ, హంగేరీ, కజకిస్తాన్, ఫ్రాన్స్, బెల్జియం, చైనా, సౌదీ అరేబియా, కెనడా, ఈజిప్ట్, స్వీడన్, జర్మనీ, రొమేనియా, పోలండ్, ఆస్ట్రియా, లిథువేనియా, ఉక్రెయిన్ ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే, ఈ దేశాలే అటాక్ లక్ష్యాలవుతాయని ఆ వీడియో హెచ్చరించింది.
ఇజ్రాయెల్ ఈ వీడియో ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని గట్టిగా హెచ్చరించింది. ‘‘ఇరాన్ వంటి దేశాలను ఎవరూ ఆపకపోతే, వారు ప్రపంచ శాంతిని తునాతునకలు చేస్తారు. మేము సైలెంట్‌గా ఉండకూడదు. ప్రపంచ దేశాలన్నీ కలసి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపింది.
ఇరాన్ వైపు నుంచి ఇప్పటికే పలు దేశాలపై సైబర్ దాడులు, మిస్సైల్ అభివృద్ధి, టెర్రరిస్టులకు మద్దతు వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యుద్ధ వాతావరణం రోజురోజుకీ తీవ్రంగా మారుతోంది.
ఇజ్రాయెల్ దీని ద్వారా ఏకంగా యుద్ధానికి సంకేతాలు పంపుతోందా? లేక అంతర్జాతీయ మద్దతు కోసం ఒత్తిడి పెంచుతోందా అన్న దానిపై విశ్లేషకులు చర్చ మొదలుపెట్టారు. ఏదైనా సరే, ఈ వీడియో ప్రపంచ శాంతికి గట్టి హెచ్చరికగా నిలిచింది.
ప్రపంచ శాంతి కోసం ఈ వివాదానికి త్వరలో పరిష్కారం లభిస్తే మంచిది. లేకపోతే, ఇది భారీ అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉంది.
