ఇజ్రాయెల్ టార్గెట్ లో ఇరాన్ అణుకేంద్రాలు.. అమెరికా కంట్లో కారం!
ఇక ఇజ్రాయెల్ ఎప్పుడైనా సరే ఇరాన్ అణు స్ధావరాల మీద దాడి చేస్తుందనే ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది.
By: Tupaki Desk | 21 May 2025 11:46 AM IST2023 అక్టోబరు 7.. ఇజ్రాయెల్ లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు మారణహోమం సాగించారు.. ఆ మరుసటి రోజు నుంచే ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది.. కొద్ది రోజులకు ఇది లెబనాన్ కు పాకింది.. తర్వాత సిరియాకు విస్తరించింది.. అక్కడ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ)ని హతమార్చింది.. ఇరాన్ పదేపదే ఇజ్రాయెల్ కు టార్గెట్ అయింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు పంపింది.. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైతం దాడికి దిగింది. వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్య దూరం 2,300 కిలోమీటర్లకు పైనే.
ఇక ఇజ్రాయెల్ ఎప్పుడైనా సరే ఇరాన్ అణు స్ధావరాల మీద దాడి చేస్తుందనే ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది. వాస్తవానికి ఇరాన్ అణ్వస్త్ర దేశం. అంతేకాక అమెరికాకు ఎప్పటినుంచో కంట్లో నలుసు. అలాంటి దేశంతో అమెరికా గత పాలకులు అందరూ కయ్యాలు పెట్టుకునేవారు. అనేక ఆంక్షలు కూడా విధించారు. దీంతో ఇరాన్ రష్యాకు బాగా దగ్గరైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో ఓ ముఖ్యమైన విషయం బయటపడింది.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ తో తన సయోధ్య ప్రయత్నాలు దెబ్బతింటాయని ఆందోళన చెందారు. ఇరాన్ అణ్వస్త్ర కేంద్రాలపై దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ తుది నిర్ణయం ఏమిటనేది తేలలేదు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం, అమెరికాలోని ఆ దేశ రాయబార కార్యాలయం కూడా ఈ ఊహాగానాలను ఖండించలేదు.
బెదిరించి.. దారిలోకి తెచ్చుకుని..
ఇరాన్ అణ్వాయుధాలను మరింతగా పెంచుకోకుండా అమెరికా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. గతంలో ఉన్న ఒప్పందానికి కొనసాగింపుగా మరో ఒప్పందం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ట్రంప్. దీనికోసం ఒమన్ లో చర్చలు సక్సెస్ అయ్యాయని అంటున్నారు. కొత్తగా ఒప్పందం చేసుకోకుంటే.. ఇరాన్ పై సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ బెదిరించారు. కానీ, దీనికిముందే ఇజ్రాయెల్ అణు దాడులకు ప్లానింగ్ చేయడం గమనార్హం.
