Begin typing your search above and press return to search.

'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' కంటే పవర్ ఫుల్... ఏమిటీ ఎంఓపీ?

ఈ సమయంలో.. ఇజ్రాయెల్ కి ఉన్న లక్ష్యాల్లో ఫోర్డో కూడా భాగమని అధికారులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 10:22 AM IST
మదర్  ఆఫ్  ఆల్  బాంబ్స్ కంటే పవర్  ఫుల్... ఏమిటీ ఎంఓపీ?
X

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే అది తమ మనుగడకు అత్యంత ప్రమాదం అని.. తమతో పాటు ప్రపంచానికీ పెను ప్రమాదమని చెబుతూ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా.. ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.. వాటిని నిర్వీర్యం చేస్తోంది. ఈ సమయంలో ఒక టార్గెట్ మాత్రం ఇజ్రాయెల్ వల్ల కాదని అంటున్నారు.

అవును... ఇరాన్ లోని యురేనియం శుద్ధి కేంద్రాల్లో 'నతాంజ్' ప్రధానమైనది కాగా.. ఆ తర్వాతి స్థానంలో 'ఫోర్డో' ఉంది. ఈ స్థావరాన్ని టెహ్రాన్ కు నైరుతి వైపున సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోమ్ నగరం వద్ద ఉన్న పర్వతాల్లో నిర్మించారు. పర్వత ప్రాంతంలో రాళ్లు, మట్టి కింద 260 అడుగుల లోతున ఉన్న ఈ ఫోర్డో అణు స్థావరానికి ఇరాన్, రష్యా ఉపరితల, గగనతల మిసైల్స్ ద్వారా రక్షణ కల్పిస్తున్నారు.

ఈ సమయంలో.. ఇజ్రాయెల్ కి ఉన్న లక్ష్యాల్లో ఫోర్డో కూడా భాగమని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లెయిటర్... ఫోర్డోను తుడిచిపెట్టడంతో ఈ ఆపరేషన్ లక్ష్యం పూర్తవుతుందని అన్నారు. అయితే... ఇజ్రాయెల్ కు ఈ స్థావరాన్ని పేల్చగలిగేటంత బాంబుల సామర్థ్యం లేదు. ఈ సమయంలోనే అమెరికా వద్ద మాత్రమే ఉన్న ఓ బాంబు తెరపైకి వచ్చింది.

అదే జీబీయు-57ఏ/బీ - ఎంఓపీ (మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్). ఇది ప్రపంచంలో బంకర్లను బద్దలు కొట్టే అతి పెద్ద బాంబు కాగా.. ఇలాంటిది ప్రస్తుతం అమెరికా దగ్గర మాత్రమే ఉందని చెబుతున్నారు. సుమారు 13,600 కేజీలు బరువు ఉండే ఈ ఆయుధం, టార్గెట్‌ లపై కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇరాన్‌ పర్వత ప్రాంతాల్లోని భూగర్భంలో లోతులో ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రంలోకి ఇది చొచ్చుకుపోగలదు.

దాదాపు ఆరు మీటర్ల పొడవు ఉండే ఈ ఆయుధం.. ప్రయోగించిన తర్వాత పేలడానికి ముందు భూ ఉపరితలం నుంచి 200 అడుగుల లోతుకు చొచ్చుకుపోతుంది. అయితే.. ఈ మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ను ఇప్పటివరకూ ఏ యుద్ధంలోనూ ఉపయోగించలేదు. కానీ.. నుయూ మెక్సికోలోని అమెరికన్ మిలటరీ టెస్టింగ్ ఏరియాలో ఉన్న వైట్ శాండ్స్ మిసైల్ రేంజ్ లో ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించారు.

'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' అని పిలిచే 9,800 కేజీల బరువుండే 'మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్' (ఎంఓఏబీ) కంటే మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ (ఎంఓపీ) చాలా శక్తివంతమైనది. మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబును 2017లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఉపయోగించారు కానీ.. మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ ని మాత్రం ఇప్పటివరకూ ఎప్పుడూ ఉపయోగించలేదు. ఇరాన్ లో ఆ అవకాశం ఉందో లేదో రెండు వారాల్లో తెలిసే అవకాశం ఉంది!

కాగా... ఇరాన్‌ పై సైనిక దాడి ప్రారంభించాలా వద్దా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్.. ‘సమీప భవిష్యత్తులో ఇరాన్‌ తో చర్చలు జరిగే అవకాశం ఉందా లేదా అనే దాని ఆధారంగా, రాబోయే రెండు వారాల్లోపు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను అని ట్రంప్’ అన్నారని తెలిపారు!