మోడీకి అరుదైన ఛాన్సు లభించనుందా?
ప్రపంచంలో ఇన్ని ఖండాలు ఉన్నప్పటికీ.. మరెక్కడా లేని దరిద్రాలు.. యుద్ధాలు.. ఉగ్రమూకలు.. అశాంతి.. తరచూ ఏదో ఒక యుద్దానికి నెలవుగా మారుతోంది ఆసియా ఖండం.
By: Tupaki Desk | 15 Jun 2025 1:00 PM ISTప్రపంచంలో ఇన్ని ఖండాలు ఉన్నప్పటికీ.. మరెక్కడా లేని దరిద్రాలు.. యుద్ధాలు.. ఉగ్రమూకలు.. అశాంతి.. తరచూ ఏదో ఒక యుద్దానికి నెలవుగా మారుతోంది ఆసియా ఖండం. తాజాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నడుస్తున్న పంచాయితీ తీవ్ర రూపం దాల్చటం.. ఒకరిపై ఒకరు సీరియస్ గా బాంబులు వేసుకోవటం.. అంతకంతకూ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్న వేళలో.. ఇజ్రాయెల్ రాయబారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధాన్ని ఆపేలా చేసే శక్తి భారత్ కు ఉందని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పేర్కొనటం గమనార్హం. ఢిల్లీలో ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు భారతదేశానికి ఇప్పుడు ఇరాన్.. ఇజ్రాయెల్ రెండు మిత్రదేశాలే కావటం తెలిసిందే. ఇదే ఈ రెండు దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల్ని పల్చన చేసే అవకాశం ఉంది.
రెండు దేశాలతో భారత్ సంప్రదించగలదు కాబట్టి.. ప్రస్తుత సంక్షోభంలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడటం తెలిసిందే. భారత్ తమకు గొప్ప మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు.
ఇరాన్ మత నాయకుడు ఖమేనీ ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ ను నాశనం చేసేందుకు కొందరు ఇరానియన్లు రహస్యంగా ప్రయత్నిస్తున్నట్లుగా అజార్ ఆరోపించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో 10వేల బాలిస్టిక్ క్షిపణులు.. వచ్చే ఆరేళ్లలో 20 వేల క్షిపణుల్ని తయారు చేసి ఇజ్రాయెల్ మీద ప్రయోగించాలన్నది ఇరాన్ ఆలోచనగా ఆరోపిస్తున్నారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలు.. పోటాపోటీగా చేసుకుంటున్న దాడుల నేపథ్యంలో ఈ రెండు దేశాలకు కావాల్సిన పెద్ద దేశం భారత్ ఒక్కటే.
ఒకవేళ ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి పేర్కొన్నట్లుగా.. ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే అవకాశం భారత్ కు ఉంది. ఇందుకు ప్రధాని మోడీ ఓకే చేసి.. రంగంలోకి దిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పాలి. కాకుంటే.. ఈ రెండు దేశాలు మొండిగా వ్యవహరించటం ఒక ఇబ్బంది. అయినప్పటికీ భారత్ ఈ అంశాన్ని సమర్థంగా డీల్ చేసి.. యుద్ధాన్ని ఆపేసి.. శాంతిని పెంచేలా అవగాహన పత్రం మీద సంతకాలు పెట్టేందుకు రెండు దేశాల్ని ఒప్పిస్తే.. ప్రపంచ పటంలో భారత్ మరింత పవర్ ఫుల్ గా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.
