ఇజ్రాయెల్ - ఇరాన్ వార్.. మన జేబులకు చిల్లు పెట్టనుందా?
అవును.. అక్కడెక్కడో రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం.. మన జేబుకు చిల్లు పెడుతుందా? అంటే అవుననే చెప్పాలి.
By: Tupaki Desk | 22 Jun 2025 12:15 PM ISTఅవును.. అక్కడెక్కడో రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం.. మన జేబుకు చిల్లు పెడుతుందా? అంటే అవుననే చెప్పాలి. ప్రపంచం కుగ్రామంగా మారటం.. ప్రతి ఒక్కరు మరొకరి మీద ఆధారపడకుండా బతుకుబండిని లాగలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. అంతిమంగా సామాన్యుడి మీద ధరల పిడుగులు పడుతున్న పరిస్థితి. తాజాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జురుగుతున్న యుద్ధం ముదిరితే మన జేబుకు భారీగా చిల్లుపడటం ఖాయం. దీనికి కారణం అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరలే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన వారం క్రితం రోజులో 11 శాతం పెరిగితే.. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వస్తోంది.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం షురూ కాక ముందు ఒక్కో బ్యారెల్ 70 డాలర్లుగా ఉంటే.. అదిప్పుడు 78.5 డాలర్లకు చేరుకుంది. ఆరు నెలల గరిష్ఠానికి ధరలు చేరుకున్న వేళ.. రానున్న రోజుల్లో ఇదే రీతిలో పెరుగుతూ పోతే.. ధరలు ఎక్కడికి వెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. యుద్ధం కారణంగా చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన పక్షంలో ముడిచమురు ధరలు ఒక్కో బ్యారెల్ 120-130 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో.. పెట్రోల్.. డీజిల్ ధరల మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
ఇరాన్ నుంచి నేరుగా బారత్ కు చమురు దిగుమతులు లేకున్నా.. ఇరాన్ అధీనంలోని హర్ముజ్ జలసంధిని మూసేస్తే మాత్రం ప్రపంచం మీద తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పాలి. ఎందుకుంటే.. ముడి చమురును సరఫరా చేసే ఒమన్ - ఇరాన్ దేశాల మధ్య ఉండే ఇరుకైన జలమార్గం. దీని ద్వారానే గల్ఫ్ నుంచి ముడి చమురు ఎగుమతులు 85 శాతం కంటే ఎక్కువ ఈ మార్గంలోనే వెళతాయి.
2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని నమోదు చేసింది. ఇది ప్రపంచం పెట్రోలియం వినియోగంలో ఐదో వంతు కావటమే. ఈ జలసంధిని ఇరాన్ అడ్డుకోవటం జరిగినా.. ఏదైనా అంతరాయంతో సరఫరాలు నిలిస్తే చమురు కొరత తీవ్రంగా మారి ధరల పెరుగుదలకు కారణమవుతుంది. అదే జరిగితే.. మన దేశంతో పాటు పలు దేశాలకు ధరాఘాతం ఖాయం. అదే జరిగితే.. మన జేబులకు చిల్లు పడటం పక్కా అని చెప్పక తప్పదు.
