ఇజ్రాయెల్ దాడిపై 21 ముస్లిం దేశాల సంయుక్త ప్రకటన ఇదే!
ఈ సమయంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ 21 అరబ్, ముస్లిం దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
By: Tupaki Desk | 17 Jun 2025 10:54 AM ISTఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు గొడ్డలిపెట్టని జీ7 దేశాధి నేతలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఈ సమయంలో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ 21 అరబ్, ముస్లిం దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
అవును... ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండిస్తూ.. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, అణ్వాయుధ నిరాయుధీకరణ, అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించడం కోసం పిలుపునిస్తూ 21 ముస్లిం, అరబ్ దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దేలట్టి చొరవ ఫలితంగా ఈ సంయుక్త ప్రకటన వెలువడింది.
ఈ ప్రకటనలో... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కియే, సౌదీ అరేబియా, సూడాన్, జోర్డాన్, పాకిస్తాన్, బహ్రెయిన్, గాంబియా, అల్జీరియా, బ్రూనై, చాడ్, కొమొరోస్, జిబౌటి, సోమాలియా, ఇరాక్, కువైట్, లిబియా, ఒమన్, ఖతార్, ఈజిప్ట్, మౌరిటానియా దేశాలు ఉన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ శత్రుత్వాన్ని వెంటనే నిలిపివేయాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి.
మరోవైపు... ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపాలని జీ-7 దేశాధినేతలు పిలుపునిచ్చారు. వాణిజ్యం, యుద్ధాలే ఎజెండాగా కెనడాలోని రాకీ మౌంటెన్స్ లో ప్రారంభమైన జీ7 సదస్సులో స్పందించిన ట్రంప్... ఇరు దేశాలు వెంటనే చర్చలు జరపాలని సూచించారు. ఇదే సమయంలో.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే మార్గాన్ని కనుగొనాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కోరారు.
ఇదే సమయంలో... ఇజ్రాయెల్ దాడుల ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతుండటం తో పాటు అమెరికా స్వరం కఠినంగా మారుతుండటంతో అరబ్ మిత్ర దేశాల ద్వారా ఇరాన్ రాయబారం పంపినట్లు తెలుస్తోంది. అయితే.. ముందు అణు ఒప్పందానికి రావాలని టెహ్రాన్ కు తాను నిక్కచ్చిగా చెప్పానని జీ7 దేశాల సదస్సు సందర్భంగా ట్రంప్ స్వయంగా ఈవిషయాన్ని వెల్లడించారు.
కాగా... ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇప్పటివరకూ కనీసం 24 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ అధికారులు తెలపగా.. ఇజ్రాయెల్ దాడిలో కనీసం 224 మంది మరణించారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ తెలిపింది.
