Begin typing your search above and press return to search.

అమెరికాను బెదిరిస్తోన్న ఇరాన్.. ఇరాన్ ను బెదిరిస్తోన్న ఇజ్రాయెల్!

అవును... ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 5:00 AM IST
అమెరికాను బెదిరిస్తోన్న  ఇరాన్.. ఇరాన్  ను బెదిరిస్తోన్న ఇజ్రాయెల్!
X

ఒక్కసారి బరిలోకి దిగాక మాటలుండవ్... ఇది ఒక సినిమా డైలాగ్ అనుకుంటే.. నిజజీవితంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధానికి ముందు నెగోషియేషన్స్ చాలా ముఖ్యమని అంటారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యలు ఉండమని చెబుతారు. అయితే ఇరాన్ కు 60 రోజుల సమయం ఇచ్చాము ఇక మాటల్లేవ్ అంటున్నారు ట్రంప్. ఈ సమయంలో ట్రయాంగిల్ ఫైట్ ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది.

అవును... ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ప్రతిదాడులు చేసింది. ఈ సమయంలో ఇరు వైపులా ప్రాణ నష్టం మొదలవ్వగా.. తాజాగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఇరాన్ ను ఇజ్రాయెల్ బెదిరిస్తుంటే.. అమెరికాను ఇరాన్ బెదిరిస్తోంది.

తాజా దాడుల నేపథ్యంలో స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్... ఇరాన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ తమ దేశంపై క్షిపణులను ప్రయోగించడం కొనసాగిస్తే.. టెహ్రాన్ తగలబడిపోతుందని హెచ్చరించారు. పౌర నివాసాలపై దాడులు చేసి, వారికి హాని తలపెట్టాలని చూస్తే.. ఆ దేశం తీవ్ర ప్రైణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇరాన్ తన చర్యలతో తన దేశంలోని ప్రజలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో.. ఇరాన్ లోని పలు లక్ష్యాలపై దాడులు చేయడానికి తమ దేశ వైమానిక దళం సిద్ధంగా ఉందని చెప్పిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్.. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా.. ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ పై ఇజ్రాయెల్ బెదిరింపులు అలా ఉంటే... తాము ఇజ్రాయెల్ పై చేస్తున్న దాడులను ఆపాలని అమెరికా చూస్తే.. ఇజ్రాయెల్ కు సహకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని టెహ్రాన్ హెచ్చరించింది. ఇందులో భాగంగా.. ఇజ్రాయెల్ కు సహకరిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను, నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ కు సహకరించే ఏ దేశానికైనా ఇవే హెచ్చరికలని తెలిపింది.

ఇదే సమయంలో... అణు ఒప్పందంపై ఇరాన్‌ కు మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా... రోజులు గడిచేకొద్దీ ఇజ్రాయెల్‌ దాడులు మరింత తీవ్రమవుతాయని స్పష్టంచేశారు. అందువల్ల.. పరిస్థితి చేయి దాటకముందే అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. దీనికోసం ఇరాన్‌ కు ఇప్పటికే వరుసగా అనేక అవకాశాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు.. తాము ఇజ్రాయెల్ కు యుద్ధంలో సహకరించడం లేదని చెబుతుండటం గమనార్హం!