అమెరికా చెంపమీద కొట్టాం.. ఖమేనీ రాలేదు.. ఆయన గొంతు బయటకు వచ్చింది
ఇక తాజాగా తన ప్రకటనలో... మధ్యలో కల్పించుకోకపోతే.. ఇజ్రాయెల్ నాశనం అవుతుందని అమెరికా భావించిందని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 27 Jun 2025 8:45 AM ISTనువ్వు క్షిపణితో కొడితే.. నేను డ్రోన్‌తో దాడి చేస్తా... నువ్వు అణు ప్లాంట్ల జోలికొస్తే.. నేను నీ సైనిక అడ్డాల సంగతి చూస్తా... అన్నట్లుగా కొన్ని రోజుల పాటు సాగింది ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ.. ఇది ఎటుపోతుంది.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న భయాందోళనలు ప్రపంచాన్ని వణికించాయి.
మధ్యలో అమెరికా తలదూర్చడంతో పశ్చిమాసియా అగ్ని గుండంగా మారుతుందా? అనేవరకు వెళ్లింది. కానీ, ఎంత కస్సుల లేచిందో అంతే చప్పున చల్లారింది. మధ్యలో అమెరికా జోక్యం.. దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం సరేసరి. మరి ఇంతకూ ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడ? 13 రోజుల కిందట మొదలైన యుద్ధం ముగిసినా.. ఆయన బంకర్ నుంచి బయటకు రారే..?
ప్రపంచంలో మొండిఘటాలైన నాయకుల్లో ఒకరు ఖమేనీ.. ఇరాన్‌ను అత్యంత కట్టుదిట్టంగా పాలిస్తున్న నాయకుడు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్‌కు టార్గెట్ అయ్యారు. ఇక సంఘర్షణ ముగిసినా.. ఆయన ఏం ప్రకటన చేస్తారు? అనేది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీ స్పందించారు. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అనంతరం ఆయన తొలిసారి గొంతువిప్పారు. 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌పై తామే గెలిచామని చెప్పుకొచ్చారు. దీనికితోడు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులతో తాము ఆ దేశాన్ని చెంప మీద కొట్టామని చెప్పుకొచ్చారు.
కాగా, ఈ నెల 19 తర్వాత ఖమేనీ స్టేట్‌మెంట్ రావడం ఇదే తొలిసారి. సరిగ్గా వారం కిందట ఇరానియన్ స్టేట్ టెలివిజన్‌లో ఆయన వ్యాఖ్యల వీడియో ప్రసారమైంది. ఇక తాజాగా తన ప్రకటనలో... మధ్యలో కల్పించుకోకపోతే.. ఇజ్రాయెల్ నాశనం అవుతుందని అమెరికా భావించిందని పేర్కొన్నారు. కానీ దీని ద్వారా అగ్ర రాజ్యం పొందినది ఏమీ లేదని నిష్టూరమాడారు.
మేం (ఇస్లామిక్ రిపబ్లిక్) గెలిచాం.. అమెరికా చెంప చెల్లుమనిపించాం.. గత సోమవారం ఖతర్‌లోని అమెరికా కీలక వైమానిక స్థావరం అల్ ఉదీద్‌ను ధ్వంసం చేశాం. ఎవరినీ చంపలేదు. పశ్చిమాసియాలోని కీలక అమెరికా కేంద్రాలను దెబ్బతీయగలం. మున్ముందు కూడా ఇలాంటివి జరగొచ్చు’’ అని ఖమేనీ కంఠం కంగుమంది. దురాక్రమణ జరిగితే... శత్రువుకు భారీ మూల్యం తప్పదు అని గట్టిగా హెచ్చరించారు.
జూన్ 13న ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలైంది. ఇరాన్ అణుకేంద్రాలు, క్షిపణి అభివృద్ధి కేంద్రాలు టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. ఖమేనీ బంకర్‌లోకి వెళ్లిపోయారు. ఈ నెల24న కాల్పుల విమరణ అమల్లోకి వచ్చిందని ట్రంప్ ప్రకటించారు. కానీ, మూడు రోజులు గడుస్తున్నా ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియరాలేదు. ఈ మధ్యలోనే ఆయన నుంచి ప్రకటన వచ్చింది.
