ఇజ్రాయెల్ కు బిగ్ షాకిచ్చిన ఇరాన్... ఎంత నష్టమంటే..?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
By: Tupaki Desk | 16 Jun 2025 10:28 AM ISTఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నప్పటికీ ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు బిగ్ షాకిచ్చింది ఇరాన్. ఇందులో భాగంగా.. టెల్ అవీవ్ పై క్షిపణుల వర్షం కురిపించింది.
అవును... ఆదివారం రాత్రి టెల్ అవీవ్ లో ఇజ్రాయెల్ మల్టిపుల్ లేయర్స్ రక్షణ వ్యవస్థను ఛేధించుకుని ఇరానియన్ డ్రోన్లు, క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో.. ఇరాన్ క్షిపణులు నివాస ప్రాంతాలను తాకడంతో టెల్ అవీవ్ నుండి భారీ పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దాడికి ఇజ్రాయెల్ లోని పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.
ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించారని.. 60 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇదే క్రమంలో.. సెంట్రల్ ఇజ్రాయెల్ లోని పవర్ గ్రిడ్ పైనా ఇరాన్ స్ట్రైక్ చేసింది. అయితే.. పెను ప్రమాదం జరగకుండా ఆ దేశ ఎలక్ట్రిక్ ఇంజనీర్లు మరమ్మత్తులు చేస్తున్నారు.
ఇదే సమయంలో.. ఉత్తర ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించినప్పటికీ రెండు హైపర్సోనిక్ క్షిపణులు మాత్రం హైఫాను ఢీకొన్నాయి. దీంతో అనేకమంది గాయపడ్డారు. ఈ విషయాలను ఇజ్రాయెల్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ కాన్, బ్రిటిష్ సముద్ర సెక్యూరిటీ సంస్థ అంబ్రే వెల్లడించింది.
అయితే... తమకు యుద్ధాన్ని విస్తరించాలనే ఆలోచన లేదని ఇరాన్ చెబుతుండటం గమనార్హం. కేవలం ఆత్మ రక్షణ కోసమే 'టెల్ అవీవ్'పై దాడి చేయాల్సి వచ్చిందని.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తే, తామూ దాడులు ఆపేస్తామని తెలిపింది. యుద్ధాన్ని పొరుగు దేశాలకు విస్తరించాలని తాము భావించడం లేదని ఇరాన్ తాజాగా పేర్కొంది.
మరోవైపు.. ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో ఇరాన్ కు పాక్ మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంఘీభావం తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా దాడులకు పాల్పడుతోందని పేర్కొంటూ.. ఆ దాడులను తీవ్రంగా ఖండించారు.
