ఇజ్రాయెల్ లో పాత డిమాండ్ కొత్తగా... నెతన్యాహు వింటారా?
గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, ఇరాన్ లు అంగీకరించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jun 2025 12:00 AM ISTగత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్, ఇరాన్ లు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ట్రంప్ ప్రకటించుకున్నారు. తనకు 'శాంతి' మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో నెతన్యాహుకు కొత్త డిమాండ్ వినిపిస్తుంది.
అవును... ట్రంప్ మధ్యవర్తిత్వం 12 రోజులకే ఇరాన్ తో మొదలైన యుద్ధం ఆగడంతో, పైగా.. ఇరాన్ లో అనుకున్న పని సక్సెస్ ఫుల్ గా పూర్తైందని చెబుతుండటంతో ఇజ్రాయెల్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అదే ఇజ్రాయెల్ లోని ప్రతిపక్షాలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుల నుంచి మరో డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాలో అవిరామంగా జరుగుతున్న యుద్ధాన్ని కూడా ఆపాలని ఇజ్రాయెల్ లోని ప్రతిపక్షాలు, మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన సెంటర్ లెఫ్ట్ డెమోక్రాట్స్ పార్టీ నేత యార్ గోలన్ స్పందిస్తూ.. గాజాలో యుద్ధం ఆపి, హమాస్ చెరలోని బంధీలను విడిపించాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో... హమాస్ ఉగ్రవాదుల చేతిలో గాజా బంకర్లలో బంధీలుగా ఉన్న తమ వారి విడుదలకు చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను వారి కుటుంబ సభ్యులు రిక్వస్ట్ చేస్తున్నారు.
కాగా... ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి, తమ పౌరులను ఊచకోత కోసిన హమాస్ ఉగ్రవాదులపై అక్టోబర్ 8 - 2023న ఐడీఎఫ్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు మొదలు అవిరామంగా గాజాను గడగడలాడించేస్తుంది. గాజా నగరం మొత్తం ప్రస్తుతం శిథిలాల కుప్పగా మారిపోయింది. తినడానికి తిండి లేక పాలస్తీనా ప్రజలు రోధిస్తున్నారు.
ఈ క్రమంలో.. రెండు రోజుల క్రితం ఈ విషయంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు... హమాస్ లొంగిపోయి, బందీలను విడుదల చేస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నా.. నెతన్యాహు మాత్రం బంతి హమాస్ కోర్టులోనే ఉందని చెబుతున్నారు!
