యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ పోస్టు.. డిఫరెంట్ గా స్పందించిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jun 2025 9:52 AM ISTపశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలోకి రెండు రోజుల క్రితం అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి ఇరాంపై దాడులు చేసింది. దీంతో.. వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో ఇరు దెసాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ పోస్ట్ పెట్టారు.. అయితే.. అలాంటిదేమీ లేదని ఇరాన్ స్పందించడం గమనార్హం.
అవును... గత కొన్ని రోజులుగా క్షిపణులతో దాడులు చేసుకుంటున్న ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి అంటూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో భారతకాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3:32 గంటలకు పోస్టు చేశారు. మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరుగనుందని తెలిపారు.
ఇదే సమయంలో.. 24 గంటల తర్వాత ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాల్సి ఉంటుందని.. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందనే భావిస్తున్నానని.. దీనికోసం నేను రెండు దేశాలను అభినందించాలనుకుంటున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
కట్ చేస్తే.. టెహ్రాన్ నుంచి భిన్నమైన ప్రకటన వచ్చింది. ఇందులో భాగంగా.. తొలుత అలాంటి ఒప్పందమేదీ లేదని పేర్కొన్న ఇరాన్.. ఆ తర్వాత కాల్పుల విరమణకు సుముఖంగానే ఉన్నట్లు సూచనప్రాయంగా చెప్పింది. సీజ్ ఫైర్ పై ట్రంప్ పోస్టు పెట్టిన తర్వాత ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రెండు విభిన్న పోస్టులు చేశారు.
ఇందులో భాగంగా... ఇజ్రాయెలే తొలుత తమపై యుద్ధం ప్రారంభించిందని.. ఈ విషయాన్ని తాము ఇప్పటికే స్పష్టం చేశామని.. ప్రస్తుతానికి కాల్పుల విరమణ, సైనిక కార్యకలాపాల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని.. అయితే, టెల్ అవీవ్ మా ప్రజలపై చేస్తున్న దురాక్రమణను మంగళవారం ఉదయం 4 గంటల్లోపు ఆపేయాలని తెలిపారు.
ఇదే సమయంలో... ఈ సంఘర్షణలను కొనసాగించాలనే ఉద్దేశం ఇరాన్ కు లేదని.. అయితే, మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత ప్రకటిస్తామని ఆయన ముందు పోస్ట్ లో రాసుకొచ్చారు.
ఆ తర్వాత కాసేపటికి మరో పోస్ట్ పెట్టిన అరాగ్చీ... ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తమ సాయుధ దళాలు చివరివరకు శక్తిమంతమైన పోరాటం కొనసాగించాయని పేర్కొన్నారు. దేశాన్ని కాపాడేందుకు, శత్రువుల దాడిపై చివరి నిమిషం వరకు స్పందించిన దళాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
దీంతో ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతాలను టెహ్రాన్ ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు. దీంతో... ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు!:
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ.. పశ్చిమాసియాలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా.. మంగళవారం తెల్లవారుజామున టెల్ అవీవ్ ను లక్ష్యంగా చేసుకొని టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకొని ఈ క్షిపణులు ప్రయోగించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
