గాజాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. కాకపోతే కొన్ని షరతులన్న నెతన్యాహు
గాజాలో హమాస్‌తో యుద్ధాన్ని ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.
By: Tupaki Desk | 19 May 2025 6:00 AM ISTగాజాలో హమాస్‌తో యుద్ధాన్ని ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. అయితే, దీనికి హమాస్ కొన్ని షరతులు ఒప్పుకోవాలన్నారు. ఈ మాటలు ఇజ్రాయెల్ వైఖరిలో మార్పును సూచిస్తున్నాయి. దోహాలో ఉన్న బందీలను విడిపించే చర్చల బృందం, పాలస్తీనా గ్రూప్‌తో యుద్ధాన్ని ముగించడానికి అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని ప్రధాని కార్యాలయం (PMO) వెల్లడించింది.
పీఎంవో తెలిపిన దాని ప్రకారం.. గాజాలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, హమాస్ వాళ్ళు పూర్తిగా లొంగిపోయి దేశం విడిచి వెళ్ళిపోవడం ద్వారా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన బందీల మార్పిడి, స్వల్పకాలిక కాల్పుల విరమణ లేదా సమగ్ర ఒప్పందం కోసం ఇజ్రాయెల్ చర్చలు జరుపుతోంది. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. హమాస్ చెరలో 58 మంది బందీలు ఉన్నారు. వారిలో 23 మంది ఇంకా బతికే ఉన్నారని తెలుస్తోంది.
హమాస్‌ను సైనిక, పాలక శక్తిగా పూర్తిగా నాశనం చేయకుండా గాజాలో పోరాటం ముగియదని ఇజ్రాయెల్ మొదటి నుంచి చెబుతోంది. ఇప్పుడు యుద్ధాన్ని ముగించడానికి సంకేతాలు ఇవ్వడం ఇజ్రాయెల్ విధానంలో ఒక పెద్ద మార్పును సూచిస్తోంది. ఇజ్రాయెల్ బందీలను విడిపించడానికి హమాస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి ప్రారంభం నుండి గాజాలోకి వైద్య, ఆహార, ఇంధన సరఫరాల ప్రవేశాన్ని ఆపేసింది. అంతేకాకుండా, గాజా స్ట్రిప్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని సహాయాన్ని కంట్రోల్ చేసే ప్రణాళికలను కూడా ఆమోదించింది.
హమాస్ ఏమంటోంది?
ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తుల సహాయంతో అమెరికా మద్దతుతో శనివారం ఇరువర్గాల మధ్య కొత్త రౌండ్ పరోక్ష కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. కాల్పుల విరమణకు బదులుగా మాత్రమే బందీలను విడుదల చేస్తామని హమాస్ స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్, అరబ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, హమాస్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ వాదనను హమాస్ లేదా ఇజ్రాయెల్ ఖండించలేదు.
ఈరోజు తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్ అంతటా కనీసం 100 మంది పాలస్తీనియన్లను హాత మార్చింది. గాజాలోని కొన్ని ప్రాంతాలపై "ఆపరేషనల్ కంట్రోల్" సాధించడానికి కొత్త భూతల దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ సైన్యం, గురువారం నుంచి వందలాది మందిని చంపుతూ దాడులను పెంచింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం నుంచి రిప్లై మాత్రం రాలేదు
నెతన్యాహుపై ఒత్తిడి పెరుగుతోందా?
ఇజ్రాయెల్‌లో, హమాస్ బందీ మటాన్ జాంగాకర్ తల్లి ఐనావ్ జాంగాకర్, హమాస్ మిగిలిన బందీలను విడుదల చేయడానికి బదులుగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన రాజకీయ ప్రయోజనాల కారణంగా యుద్ధాన్ని ముగించడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు."ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికీ పాక్షిక ఒప్పందాలపై మాత్రమే పట్టుబడుతోంది. వారు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధపెడుతున్నారు. 58 మంది మా పిల్లలను వెంటనే తిరిగి తీసుకురండి." అని జాంగాకర్ X సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌లో అన్నారు.
