Begin typing your search above and press return to search.

ఈ మూడు ‘హెచ్’లపై ఇజ్రాయెల్ దండయాత్ర.. వారు ఎవరంటే?

గతంలో గాజా (Gaza) ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఒక పెద్ద శక్తిగా ఉండేవారు. ఇజ్రాయెల్ సరిహద్దులకు అతి సమీపంలో ఉండి నిరంతరం దాడులతో విరుచుకుపడేవారు.

By:  Tupaki Political Desk   |   11 March 2026 12:44 PM IST
ఈ మూడు ‘హెచ్’లపై ఇజ్రాయెల్ దండయాత్ర.. వారు ఎవరంటే?
X

పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య పోరాటం కాదు, అది ఇజ్రాయెల్ వర్సెస్ మూడు ఉగ్రవాద సంస్థల మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరాటం. ఈ మూడు సంస్థల పేర్లు 'H' అక్షరంతో మొదలవ్వడం విశేషం. అవే హమాస్ (Hamas), హిజ్బుల్లా (Hezbollah), మరియు హుతీ (Houthi). విచిత్రమేమిటంటే, ఈ మూడింటికి వెనుక ఉండి ఆయుధాలు మరియు ఆర్థికంగా అండదండలు అందిస్తోంది మాత్రం ఇరాన్ దేశమే. అయితే, ఇజ్రాయెల్ తన సైనిక శక్తితో ఈ మూడు శక్తులను దాదాపు తుడిచిపెడుతోంది.

మొదటి శత్రువు.. హమాస్ తుడిచిపెట్టుకుపోయింది!

గతంలో గాజా (Gaza) ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఒక పెద్ద శక్తిగా ఉండేవారు. ఇజ్రాయెల్ సరిహద్దులకు అతి సమీపంలో ఉండి నిరంతరం దాడులతో విరుచుకుపడేవారు. కానీ, ఆ సమయంలో ఇజ్రాయెల్ యుద్ధం చేయడంతో హమాస్‌ దాదాపు తుడిచిపెట్టింది. ఇప్పుడు అక్కడ హమాస్ అనేది పేరుకు మట్టుకే తప్పితే, క్షేత్ర స్థాయిలో వారి ఉనికి కనిపించడం లేదు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు వారు ఎలాంటి ప్రభావం చూపలేనంతగా బలహీనపడ్డారు.

రెండో శత్రువు: హుతీలు - దూరం ఉన్నా తప్పని సెగ!

ఇక రెండో 'H'.. హుతీలు. వీరు ప్రధానంగా సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో, యెమెన్‌లో ఉంటారు. భౌగోళికంగా ఇజ్రాయెల్ దేశానికి వీరు చాలా దూరంలో ఉన్నారు. ఆ దూరం కారణంగా వీరు ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టం కలిగించలేకపోయినప్పటికీ, ఇరాన్ ప్రోద్బలంతో అప్పుడప్పుడు క్షిపణి దాడులకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ముందు వీరి ఆటలు సాగడం లేదు.

మూడో శత్రువు: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ పంజా!

అన్నిటికంటే ప్రమాదకరమైన శత్రువు హిజ్బుల్లా. ఎందుకంటే వీరు ఇజ్రాయెల్ పక్కనే ఉన్న లెబనాన్ దేశానికి ఆనుకొని ఉంటారు. ప్రస్తుతం ఇరాన్ ఉసిగొల్పడంతో హిజ్బుల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో దాడులు ప్రారంభించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్, అటు ఇరాన్ మీద ఇటు హిజ్బుల్లా మీద ఒకేసారి ఎటాక్ చేసింది. లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ భీకర దాడుల్లో సుమారు 700 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమయ్యారు. వారి రహస్య స్థావరాలను, ఆయుధ డిపోలను ఇజ్రాయెల్ దళాలు బాంబులతో నేలమట్టం చేశాయి.

ఇరాన్ ఆధిపత్యానికి గట్టి దెబ్బ!

ఈ మూడు ఉగ్రవాద సంస్థలను (Proxy Groups) అడ్డం పెట్టుకొని పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని చాటాలని ఇరాన్ ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్‌ను మూడు వైపుల నుంచి ముంచెత్తాలని చూసిన ఇరాన్ వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టింది. ఇజ్రాయెల్ కేవలం ఆ సంస్థలనే కాకుండా, వాటికి మద్దతుగా నిలిచిన ఇరాన్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పశ్చిమాసియాలో సమీకరణాలు మారిపోయాయి. ఇజ్రాయెల్ చూపుతున్న ఈ దూకుడు వల్ల ఇరాన్ ఇప్పుడు తన సొంత రక్షణ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లెబనాన్ పాత్ర, యుద్ధ ఫలితం

హిజ్బుల్లాను అణచివేయడంలో ఇజ్రాయెల్ లెబనాన్ దేశ సహాయాన్ని కూడా తీసుకోవడం గమనార్హం. ఒకే యుద్ధంతో ఈ మూడు 'H' సంస్థల ఉనికిని ప్రశ్నార్థకం చేయడం ద్వారా ఇజ్రాయెల్ తన సత్తాను చాటింది. దశాబ్దాలుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉగ్రవాద ముప్పును ఈ దెబ్బతో శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే, ఇంతటి భీకర యుద్ధం వల్ల ఆయా ప్రాంతాల్లోని సాధారణ ప్రజల జీవనం పూర్తిగా ఛిన్నాభిన్నమైంది.

ఒకే యుద్ధంతో తన చుట్టూ ఉన్న ట్రిపుల్-హెచ్ ప్రమాదాలను ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. హమాస్‌ను బలహీనపరిచి, హుతీలను నియంత్రించి, హిజ్బుల్లాను చావుదెబ్బ కొట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన సైనిక ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, ఈ యుద్ధం వల్ల వేలాది మంది సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో శాంతి ఎప్పుడు నెలకొంటుందో కాలమే నిర్ణయించాలి.