5 రోజుల్లో 2వ సారి... ఆ కుర్చీలో కూర్చున్న పెద్ద తలలను లేపేస్తోన్న ఇజ్రాయెల్!
ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలీ రషీద్ మరణించారు. దీంతో.. ఆయన స్థానంలో అలీ షద్మానీని నియమించారు.
By: Tupaki Desk | 17 Jun 2025 2:47 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు ఇరాన్ కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలీ రషీద్ మరణించారు. దీంతో.. ఆయన స్థానంలో అలీ షద్మానీని నియమించారు. అయితే తాజాగా ఆయనను హతమార్చింది ఐడీఎఫ్.
అవును... ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణు స్థావరాలు, సైనిక శిబిరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలటరీ అధికారి అలీ రషీద్ మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం అతని స్థానంలో అలీ షాద్మానీని ఇటీవల సాయుధ దళాలకు నూతన నాయకుడిగా ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నియమించారు. ఈయనను ఖమేనీకి రైట్ హ్యాండ్ అని కూడా అంటారు.
ఆయన సెంట్రల్ టెహ్రాన్ లోని ఓ ప్రదేశంలో తల దాచుకున్నట్లు తమకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ఈ దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ సందర్భంగా... ఇజ్రాయెల్ పై ఇరాన్ చేస్తున్న పలు క్షిపణి దాడులకు షాద్మానీ నేతృత్వం వహించారని తెలిపింది. ఈయన ఖమేనీకి సన్నిహిత సలహాదారుడని వెల్లడించింది.
కాగా... ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు ఇరాన్ కీలక నేతలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇరాన్ కు చెందిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ మొహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మొహదీ రబ్బానీ, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ మేజర్ జనరల్ హోస్సేన్ సలామీ ఉన్నారు.
ఇదే సమయంలో.. సైనిక దళాల పర్యవేక్షకుడు మహ్మద్ బాఘేరి, దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి అమీర్ అలీ హాజీజదేతో పాటు సుమారు ఆరుగురు కీలక అణుశాస్త్రవేత్తలు మృతిచెందినట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం!:
ఇదే సమయంలో... తమపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారనే నిఘా సమాచారం మేరకు టెహ్రాన్ విమానాశ్రయంలో ఉంచిన రెండు ఎఫ్-14 ఫైటర్ జెట్ లపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని ఎయిర్ పోర్టులో సిద్ధంగా ఉంచిందని.. దీన్ని తాము సమర్ధవంతంగా అడ్డుకున్నామని తెలిపింది.
తమ దాడిలో ఆ యుద్ధ విమానాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఐడీఎఫ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ ఫైటర్ జెట్ లను 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ కు ముందు ఇరాన్ కు అమెరికా డెలివరీ చేసింది. అప్పటి నుంచీ వీటినే ఇరాన్ వాడుతోంది.
