Begin typing your search above and press return to search.

మరో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్... బంకర్ బస్టర్ బాంబులతో దాడులు!

ఇరాన్ లో ఉన్న అణుకేంద్రాలే లక్ష్యంగా అంటూ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో సుమారు వెయ్యిమంది వరకూ ఇరాన్ లో మరణాలు సంభవించాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 9:02 AM IST
మరో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్...  బంకర్  బస్టర్  బాంబులతో దాడులు!
X

అక్టోబర్ 2023 నుంచి హమాస్ తో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మొదట్లో యుద్ధంలా ఉన్నా.. తర్వాత ఐడీఎఫ్ దండయాత్రలా మారిపోయిన పరిస్థితి. నాటి నుంచి అవిరామంగా కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా... ప్రస్తుతం గాజాలో పరిస్థితి అత్యంత దయణీయంగా మారిందని అంటున్నారు. అదలా ఉండగనే ఇరాన్ పై దాడులకు దిగింది ఐడీఎఫ్.

ఇరాన్ లో ఉన్న అణుకేంద్రాలే లక్ష్యంగా అంటూ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించింది. ఈ యుద్ధంలో సుమారు వెయ్యిమంది వరకూ ఇరాన్ లో మరణాలు సంభవించాయని అంటున్నారు. అయితే మూడు రోజుల క్రితం ఆ యుద్ధం ముగిసింది. ప్రస్తుతం పశ్చిమాసియా కాస్త ప్రశాంతంగా మారిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ మరో పనికి పూనుకుంది.

అవును... ఇరాన్ తో యుద్ధం ముగిసి పట్టుమని వారం రోజులు కాకుండానే మరో పనికి పూనుకుంది ఇజ్రాయెల్. ఇందులో భాగంగా... లెబనాన్‌ లోని హెజ్‌ బొల్లా భూగర్భ స్థావరాలే లక్ష్యంగా.. బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు.. ఈ దాడులకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు.

ఇందులో భాగంగా.. శుక్రవారం తమ వైమానిక దళం.. లెబనాన్‌ లోని పలు పర్వత ప్రాంతాల్లో గల ఉగ్రవాద హెజ్‌ బొల్లా గ్రూప్ సభ్యుల భూగర్భ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసిందని.. ఈ దాడుల్లో హెజ్‌ బొల్లాకు చెందిన పలు కీలక స్థావరాలను సైతం ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ అధికారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో... టెల్‌ అవీవ్‌ ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ బాంబుల వల్ల పలు ప్రాంతాలలోని భవనాలు దెబ్బతినగా.. అనేకమంది పాలస్తీనియన్లు గాయాలపాలయ్యారని.. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. లెబనాన్‌ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

కాగా... గత ఏడాది నవంబరులో ఇజ్రాయెల్‌ - హెజ్‌ బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. హమాస్‌ కు మద్దతుగా ఇజ్రాయెల్‌ పై హెజ్‌ బొల్లా దాడులు చేయడంతో.. ప్రతి చర్యగా ఇజ్రాయెల్‌ ఆర్మీ విరుచుకుపడి.. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది.