Begin typing your search above and press return to search.

యాంకర్ న్యూస్ చదువుతుండగా దూసుకొచ్చిన మిసైల్.. షాకింగ్ వీడియో!

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:30 PM IST
యాంకర్ న్యూస్ చదువుతుండగా దూసుకొచ్చిన మిసైల్.. షాకింగ్ వీడియో!
X

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పోటా పోటీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య గగనతలం యుద్ధ విమానాల శబ్ధాలతో హోరెత్తిపోతోంది. ఈ సమయంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఇందులో భాగంగా.. స్టూడియోలో యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సైల్ అటాక్ జరిగింది.

అవును... ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ పై ఇజ్రాయెల్‌ క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడుతోంది. తొలుత అణు స్థావరాలు, తర్వాత సైనిక స్థావరాలు, అనంతరం చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల జనావాసాలపైనా ఇజ్రాయెల్ క్షిపణులు పడుతున్నాయని అంటుననారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఛానల్ స్టూడియోలో యాంకర్ వార్తలు చదువుతుండగా.. మిస్సైల్ వణికించింది.

ఇందులో భాగంగా... ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ఐఆర్ఐబీ’ టెహ్రాన్ ప్రధాన కార్యాలయంపై సోమవారం ఇజ్రాయెల్ దాడి చేసింది! దీర్ఘకాల, ప్రాంతీయ శత్రువుల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో.. న్యూస్ ఛానల్ లో యాంకర్ వార్తలు చదవడం ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలో.. ఆ స్టూడియోపై మిస్సైల్ అటాక్ జరిగింది! దీంతో.. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడ నుంచి పరుగెట్టింది.

ఆ సమయంలో భవనం షేక్ అయ్యి, పవర్ కట్ అయ్యింది. ఇజ్రాయెల్ దాడి అనంతరం దట్టమైన నల్లటి పొగతో కప్పబడిన ఐఆర్ఐబీ లోని దృశ్యాలను ఇరాన్ మీడియా చిత్రీకరించింది. ఈ ఛానల్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత.. కాంప్లెక్స్ అంతటా శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను చిత్రీకరించారు. అంతకుముందు టెహ్రాన్ లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి.

కాగా... ఇరాన్‌ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ 'ఎక్స్‌'లో పేర్కొంది. "మీ భద్రత కోసమే ఈ హెచ్చరిక.. దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివసించేవారు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి.. మళ్లీ మేము చెప్పేవరకు ఆ ప్రదేశాలకు రావొద్దు.. ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదకరం" అని తెలిపింది.

మరోవైపు ఇరాన్ దాడుల్లో తమ పౌరులు మృతి చెందడం, గాయాలపాలవ్వడంపై ఇజ్రాయెల్ ఘాటుగా స్పందించింది. ఇందులో భాగంగా.. తమ పౌరులపై ఇరాన్‌ చేస్తున్న దాడులకు టెహ్రాన్‌ నగర ప్రజలు మూల్యం చెల్లించుకొంటారని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ఖట్జ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీని ఉద్దేశించి.. ఖట్జ్‌ తన టెలిగ్రామ్‌ ఛానెల్‌ లో ఓ కీలక పోస్టు పెట్టారు.

ఇందులో... గర్వం నిండిన ఆ నియంత ఇప్పుడు హంతకుడిలా మారాడని.. ఉద్దేశ్యపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టి ఆపరేషన్ ను నిలిపివేయించాలనే ఉద్దేశ్యంతో పౌరుల గృహాలను లక్ష్యంగా చేసుకొంటున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా... టెహ్రాన్ ప్రజలు దీనికి అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లిస్తారని ఖట్జ్ హెచ్చరించారు.