ఆకాశంలో మిణుగురులు... ఇరాన్ గగనతలంపై విమానాల వీడియో వైరల్!
ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఇరాన్ లోని అణుకేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ ఆపరేషన్ చేపట్టింది.
By: Tupaki Desk | 13 Jun 2025 2:00 PM ISTఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఇరాన్ లోని అణుకేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు ఉన్నతాధికారులు మృతిచెందారు. ఈ సమయంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది.
దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్ట్ లలోనూ విమానాల రాకపోకలు నిలిపివేసింది. దీంతో.. 16 విమానాలకు అంతరాయం కలిగినట్లు ఎయిరిండియా వెళ్లడించింది! ఈ నేపథ్యంలో ఫ్లైట్ ట్రేడర్ 24 నుంచి వచ్చిన ఓ వీడియో.. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి తక్షణ ప్రభావాన్ని.. ఇరాన్ గగనతలంపై ఎయిర్ ట్రాఫిక్ పూర్తి క్లియరెన్స్ ను చూపించింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. దీంతో.. ఇరాన్ గగనతలంపై ప్రయాణించే వాణిజ్య, ప్రజా విమానాలు వేగంగా దారి మళ్లించబడ్డాయి. దీంతో.. ఇరాన్ - ఇరాక్ గగనతలం పూర్తిగా ఖాళీగా కనిపిస్తోంది! దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దీనికి సంబంధించిన వీడియో... యుద్ధ సమయం అప్పటికప్పుడు ప్రపంచ విమానయాన ప్రయాణాలను ఎలా మారుస్తుందో చూపిస్తోంది. ఇందులో విమానాలు రియల్ టైం లో దారి మళ్లించడంతో పాటు ఇరాన్ గగనతలం నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం కూడా చూపిస్తోంది.
అయితే... ఈ భారీ ఎత్తున జరుగుతున్న మళ్లింపు.. అంతర్జాతీయ విమానయానంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... విమానాల ప్రయాణ వ్యవధి ఎక్కువ కావడం, ఈ ప్రాంతాల గుండా ప్రయాణించే విమానయాన సంస్థలకు ఇంధన ఖర్చులు పెరగడం వంటి పరిణామాలు సంభవించొచ్చని చెబుతున్నారు.
కాగా... ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా మళ్లీ భీకరంగా రగులుతోంది. ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని... ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు "ఆపరేషన్ రైజింగ్ లయన్" ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశామని అన్నారు.
ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ టెహ్రాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోందని.. ఈ ముప్పును పూర్తిగా తొలగించేవరకూ ఈ ఆపరేషన్ చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో.. ఈ ఆపరేషన్ ఎంతకాలం పడుతుందనేది అప్పుడే చెప్పలేమని తెలిపారు. దీంతో... ఇరాన్ గగనతలం ఎప్పుడు క్లియర్ అవుతుందనేది బిగ్ క్వశ్చన్ గా మారింది.
