'తదుపరి దాడులు మరింత క్రూరంగా'... ఇరాన్ కు ట్రంప్ మార్క్ హెచ్చరిక!
అవును... ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ కు చెందిన అగ్రశ్రేణి సైనిక నాయకులు, సుమారు ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టులు మృతి చెందారు.
By: Tupaki Desk | 13 Jun 2025 5:43 PM ISTఇరాన్ పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు "ఆపరేషన్ రైజింగ్ లయన్" ను ప్రారంభించింది. ఇది ఎప్పుడు ఆగుతుందనే విషయంపై స్పష్టత లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేసిన పరిస్థితి. మరో వైపు ఈ దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు మరణించారు.
ఇప్పటికే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ రహస్య ఆపరేషన్ నిర్వహించి ధ్వంసం చేయగా.. అనంతరం వైమానిక దాడులతో ఐడీఎఫ్ చెలరేగిపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 200 యుద్ధ విమానాల దండు ఇరాన్ పైకి వెళ్లిందని.. మొత్తం 100 టార్గెట్లపై దాడులు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు.
అవును... ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ కు చెందిన అగ్రశ్రేణి సైనిక నాయకులు, సుమారు ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టులు మృతి చెందారు. ఈ సమయంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ట్రంప్ నుంచి ఇరాన్ కు ఘాటు హెచ్చరికలు వచ్చేశాయి. అణు ఒప్పందాన్ని కుదురుచుకోవాలంటూ ట్రంప్ హెచ్చరించారు.
ఇందులో భాగంగా... అణు ఒప్పందానికి అంగీకరించకపోతే ఇప్పటికే ప్లాన్ చేసిన తదుపరి దాడులు మరింత క్రూరంగా ఉంటాయని ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్... ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ఇరాన్ కు ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చానని అన్నారు. ఈసారి అంగీకరించకపోతే ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని వారికి చెప్పినట్లు తెలిపారు.
గతంలో శాంతి ప్రయత్నాలను ప్రతిఘటించిన ఇరాన్ తీవ్రవాదులంతా ఇప్పుడు చనిపోయారని గుర్తుచేసిన ట్రంప్... చాలా ఆలస్యం కాకముందే ఈ ఒప్పందాన్ని చేయాలని టెహ్రాన్ ను కోరారు. ఇప్పటికే గొప్ప మరణం, విధ్వంసం జరిగిందని.. మొత్తం నాశనం అవ్వక ముందే.. ఒకప్పుడు ఇరాన్ సామ్రాజ్యంగా పిలవబడే దానిని కాపాడుకోవాలని సూచించారు.
ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందన అత్యంత భయంకరంగా ఉంటుందంటూ ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రతిజ్ఞ చేసిన కొద్ది సేపటికే డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
