ఇస్లామిక్ ఆర్మీ పుట్టుకొస్తుందా...రీజన్ ఏంటి ?
ప్రపంచంలో ఈ రోజున అనేక రకాలైన కారణాలతో యుద్ధం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వీటి విషయంలో చాలా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 5:48 PMప్రపంచంలో ఈ రోజున అనేక రకాలైన కారణాలతో యుద్ధం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వీటి విషయంలో చాలా చర్చ సాగుతోంది. అంతిమంగా యుద్ధం అంటే ఆధిపత్యం కోసమే అన్నది ఉంది. వెనకటి శతాబ్దాలకు వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. అయితే యుద్ధాల వెనక ఇతర రంగులూ ఉంటాయా అంటే అంతర్లీనంగా ఉంటాయన్న విశ్లేషణలూ ఉన్నాయి.
ఇక ప్రపంచంలో చాలా చోట్ల పరస్పర సహకారంతో దేశాలు ముందుకు సాగుతూ ఉంటాయి. ఏ ఒక్క దేశమైనా తానుగా అభివృద్ధి సాధించలేదు. అందరి సాయం కావాలి. మరీ ముఖ్యంగా పొరుగు దేశాలతోనే మంచి సంబంధాలు ఉండాలి కానీ ఇపుడు అవే దాయాదులుగా మారి సమరానికే సై అంటున్నాయి. గత యాభై ఏళ్ళుగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉన్న గొడవలు అలాంటివె.
ఇజ్రాయిల్ ని ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించినా కూడా ఇరాన్ గుర్తించడం లేదు. దాంతోనే గొడవ వస్తోంది. అంతే కాదు ఇజ్రాయిల్ ఉనికిని లేకుండా చేయాలని ప్రచ్ఛన్న యుద్ధానికి ఇరాన్ చుట్టూ ఉన్న దేశాల ఆసరాతో పధక రచన చేస్తోంది అన్నది ఇజ్రాయిల్ ఆరోపణ. ఇపుడు ఆ ప్రచ్చన్న యుద్ధం ముసుగు తొలగింది. ప్రత్యక్ష యుద్ధానికే రెండు దేశాలు రెడీ అయిపోయాయి.
అతి చిన్న దేశంగా ఉన్న ఇజ్రాయిల్ చుట్టూ అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. అయితే యూదుల దేశంగా ఉన్న ఇజ్రాయిల్ అత్యంత తెలివైన దేశంగా పేరు తెచ్చుకుంది. చిన్న దేశం అయినా అక్కడ ఉన్న ప్రతీ పౌరుడూ ఒక సైనికుడే. పదేళ్ల పిల్లాడి నుంచి తొంబై ఏళ్ల వృద్ధుడి వరకూ అంతా కూడా యుద్ధం అంటే చాలు ఆయుధాలు ఉన్నా లేకున్నా సమరానికి సిద్ధం అవుతారు.
అలా ఇజ్రాయిల్ పౌరుల మైండ్ సెట్ ఉంటుంది. అంతే కాదు ఇజ్రాయిల్ కి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చాలా గట్టివి. అవి ప్రత్యర్ధి మనసులోకి కూడా ప్రవేశించి గుట్టు మట్టూ అన్నీ పట్టేయగలవు. అందుకే ఇజ్రాయిల్ అంటే చిన్న దేశమని కాదు చాలా బలమైన దేశమని అంతా భావిస్తారు.
ఇక ఇరాన్ తో ఇజ్రాయిల్ కి యుద్ధం వచ్చింది. ఈ సమయంలో పలు ముస్లిం దేశాలు ఇరాన్ కి మద్దతుగా నిలుస్తున్నాయి. దాంతో మూడో పక్షంగా కొన్ని దేశాలు ముందుకు రావడంతో ఈ యుద్ధ స్వరూపమే మారిపోయేలా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇరాన్ కి నిన్నటికి నిన్న యెమన్ దేశం మద్దతుగా నిలిచింది.
అదే విధంగా పాకిస్తాన్ కూడా మద్దతు ఇస్తోంది. అంతే కాదు ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఒకవేళ అణుదాడికి పాల్పడితే పాకిస్థాన్ తక్షణమే రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌పై అణుబాంబుతో విరుచుకుపడుతుందని ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక అధికారి మొహసిన్ రెజాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోనే ఇపుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చ సాగుతోంది.
ఆయన తాజాగా ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇజ్రాయిల్ ఇరాన్ మీద అణు బాంబు ప్రయోగిస్తే ఆ మరుక్షణం పాక్ కూడా ఇర్జాయిల్ ని టార్గెట్ చేస్తుంది అని అన్నారు. అంతే కాదు ఇస్లామాబాద్ కూడా టెల్ అవీవ్‌పై అణుబాంబును ప్రయోగిస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో పాకిస్థాన్ నుంచి ఇరాన్ కి ఒక కచ్చితమైన భరోసా లభించిందని ఇరాన్ జాతీయ భద్రతా మండలిలో సభ్యుడు కూడా అయిన మొహసిన్ రెజాయి తెలిపారు.
దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ సమాజంలో చర్చ చెలరేగుతోంది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కాస్తా అణు యుద్ధంగా మారుతుందా అన్న సందేహాలు కూడా అంతర్జాతీయ దౌత్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ ఒక్కటే అని ఊరుకోలేదు. ఆయన మరో కీలక ప్రతిపాదన చేశారు. అదేంటి అంటే ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ పెట్టారు. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలతో పాటు భావసారూప్యత కలిగిన ఇస్లామిక్ దేశాలు ఇందులో చేరుతాయని అన్నారు. ఆ విధంగా తమకు తాము రక్షించుకునేందుకు ప్రత్యర్థిని దునుమాడేందుకు ఈ ఆర్మీ ప్రయత్నిస్తుందని అంటున్నారు.
అయితే మొహసిన్ రెజాయి చేసిన ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం అంత సులువు కాదనే అంటున్నారు. ఇస్లామిక్ దేశాలు ప్రపంచంలో అత్యధికం ఉన్నా వేటి ప్రయోజనాలు అవి చూసుకుంటాయి. ఇలా మత ప్రాతిపదికన ఆర్మీని ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నా దీర్ఘకాలంలో వచ్చే ఇబ్బందులు కూడా తెలిసిన అనేక దేశాలు ఇరాన్ తో కలసి నడవడానికి సిద్ధపడవు అని అంటున్నారు.
అయితే ఈ ప్రతిపాదన మాత్రం ఇపుడు చర్చగా ఉంది. ఒకవేళ కొన్ని దేశాలు అయినా ఓకే అంటే రాత్రికి రాత్రి పశ్చిమాసియాలోనే కాదు మొత్తం ఆసియా ఖండంలోనే బలాబలాలు తారు మారు అవుతాయని అంటున్నారు. కానీ ఇది కేవలం మొహసిన్ రెజాయి ప్రతిపాదనగానే చూడాలని అంటున్నారు.