Begin typing your search above and press return to search.

విరాళాలతోనే జనసేన నడుస్తోందా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ‘మనపార్టీ-మనబాధ్యత’ పేరుతో పార్టీ విరాళానికి తెరలేపారు.

By:  Tupaki Desk   |   1 Sept 2023 10:21 AM IST
విరాళాలతోనే జనసేన నడుస్తోందా ?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ‘మనపార్టీ-మనబాధ్యత’ పేరుతో పార్టీ విరాళానికి తెరలేపారు. ఎవరైనా సరే తమ జీతంలో ఒక్కరోజు జీతాన్ని విరాళంగా ఇవ్వవచ్చని ట్విట్టర్ వేదికగా పార్టీ అధినేత పవన్ విజ్ఞప్తిచేశారు. అలాగే పార్టీ అభిమానులు, మద్దతుదారులు 10 రూపాయల విరాళం నుండి ఎంత విరాళమైనా ఇవ్వవచ్చని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ట్విట్టర్ వేదికగా పిలుపిచ్చారు.

అంతాబాగానే ఉంది కానీ అసలు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలిచ్చే విరాళాలతోనే పార్టీని పవన్ నడపగలరా ? అన్నదే అసలు పాయింట్. ఆమధ్యేమో పార్టీని నడపాలంటే తాను సినిమాల్లో నటించక తప్పదన్నారు. సినిమాల్లో తాను తీసుకునే రెమ్యునరేషన్ తోనే పార్టీని నడుపుతున్నట్లు చెప్పారు. మధ్యలో పార్టీకి నిధుల కోసమని పారిశ్రామికవేత్తలు, ప్రవాస ఆంద్రులతో కూడా భేటీ అయ్యారు. ఇదే పనిమీద విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు.

మళ్ళీ ఇఫుడేమో జీతంలో ఒకరోజు వేతనాన్ని పార్టీకి విరాళంగా అందివ్వమని అడుగుతున్నారు. నిజానికి 10 రూపాయల విరాళాలతోనే ఏ పార్టీ కూడా నడవదు. పార్టీ నడవాలంటే అందుకు మార్గాలు వేరే ఉన్నాయి. గుప్త దాతలు, పారిశ్రామికవేత్తలు లాంటి వాళ్ళు తలా ఓ చేయి వేస్తే కానీ పార్టీ నిర్వహణ సాధ్యంకాదు. పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంటేనే ఎవరైనా భారీ విరాళాలు ఇస్తారు. రేపటి ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయాలని అనుకుంటున్న ఆశవాహులు కూడా పెద్ద మొత్తంలో పార్టీకి విరాళాలు ప్రకటిస్తారు.

ఒకవైపు ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకోవటానికి రెడీ అవుతునే పార్టీకి మరోవైపు భారీ విరాళాలు ఇస్తారు. ఇలాంటి భూరి విరాళాల వల్లే పార్టీ నిర్వహణ సాధ్యమవుతుంది. అంతేకానీ 10 రూపాయలు, జీతంలో ఒక్కరోజు వేతనం ఏమూలకు సరిపోదు. ఎందుకంటే పవన్ కదలాలంటే ప్రత్యేకమైన విమానం లేకుండా కదలరు. కాబట్టి విమానాల అద్దెలకే మొత్తం నిధులు సరిపోతుంది. ఇక పార్టీ నిర్వహణకు నిధులు ఎక్కడుంటాయి. అయినా గడచిన పదేళ్ళుగా పార్టీని నడుపుతున్నారు కదా ఖాతాలో ఎంతమొత్తం జమైంది ? ఏమేరకు నిధులున్నాయనే విషయాన్ని పవన్ ఎప్పుడూ ప్రకటించలేదే ?