Begin typing your search above and press return to search.

గురువు రుణం మోడీ తీర్చుకున్నట్లేనా...!?

వాజ్ పేయి ప్రసంగాలు మేధావులను చదువరులను ఆకట్టుకుంటే అద్వానీ ప్రసంగాలు సాదర జనాలకు చేరువ అవుతాయి.

By:  Tupaki Desk   |   3 Feb 2024 1:30 PM GMT
గురువు రుణం మోడీ తీర్చుకున్నట్లేనా...!?
X

లాల్ కిషన్ అద్వానీ అంటేనే ఒక పొలిటికల్ వైబ్రేషన్. ఆయన బీజేపీకి అసలైన గ్రామర్. ఆయన వాజ్ పేయ్ గ్లామర్ ని జోడించి ఈ రోజు మోడీ చెబుతున్న డబుల్ ఇంజన్ ని బీజేపీకి ఏనాడో అందించారు. వాజ్ పేయి క్లాస్ లీడర్ అయితే అద్వానీ మాస్ లీడర్. వాజ్ పేయి ప్రసంగాలు మేధావులను చదువరులను ఆకట్టుకుంటే అద్వానీ ప్రసంగాలు సాదర జనాలకు చేరువ అవుతాయి.


బీజేపీ అన్న పార్టీని సగటు జనాలకు పరిచయం చేసిన ఘనత అచ్చంగా అద్వానీదే అంటే అతిశయోక్తి లేదు. అద్వానీకి ఉక్కు మనిషి అని పేరు. నిజంగా ఆయన సంకల్పం అలాంటిదే. కేవలం రెండు సీట్లకే పరిమితం అయి 1984లో వాజ్ పేయి వంటి నాయకుడే ఓడిన దారుణమైన నేపధ్యం నుంచి పార్టీకి 1988 నాటికి డబుల్ డిజిట్ నంబర్ కి సీట్లను పెంచారు అంటే అది అద్వానీ మేధావితనం గానే చూడాలి.


ఆయన 1986లో బీజేపీకి ప్రెసిడెంట్ అయిన తరువాతనే పార్టీ పరిస్థితిలో మార్పు కనిపించింది. కమలం నిండుగా వికసించింది. అద్వానీ రాజకీయ ఎత్తులు వ్యూహాలు చాణక్యం కూడా బీజేపీ ఎదుగుదలలో ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాలి. అద్వానీకి ప్రతీ చోటా ప్రతీ రాష్ట్రంలో నమ్మకం అయిన శిష్యులు ఎంతో మంది ఉన్నారు. అందుకే అద్వానీ శిష్యులమని ఎంతో మంది ఈ రోజుకీ చెప్పుకుంటారు.

అలా బీజేపీకి తరువాత తరం నాయకత్వాన్ని అద్వానీ అందించారు. ఈ రోజున దేశాన్ని ఏలే నరేంద్ర మోడీ వంటి వారు అద్వానీ శిష్యులే. దేశానికి ఉప రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎం వెంకయ్యనాయుడు అలాగే కేంద్ర మంత్రిగా విశేష ప్రతిభ చూపిన సుష్మా స్వరాజ్ వంటి వారు ఎందరో అద్వానీ శిష్య బృందంలో ఉన్నారు. వాజ్ పేయి కి అభిమానులు ఉంటే అద్వానీకి శిష్యులు ఉంటారు.

అందుకే బీజేపీ పటిష్టంగా ఈ రోజుకీ ఉంది. బీజేపీకి అద్వానీ హిందూత్వ అనే ఆయుధాన్ని ఇచ్చారు. వాజ్ పేయ్ ఉదార వాదం తో బీజేపీ ఒక వైపు నెమ్మదిగా సాగుతూంటే అద్వానీ హిందూత్వ కార్డుతో దూకుడు పెంచి అధికారానికి చేరువ చేశారు. ఇక అద్వానీకి వాజ్ పేయ్ సహచరుడు, గురువు కూడా. అలా ఆయనే జీవిత పర్యంతం వాజ్ పేయ్ ని భక్తితో గౌరవించారు

బీజేపీకి అధికారం దక్కినా వాజ్ పేయి వెనకనే నిలబడి తాను ప్రధాని పదవిని దూరంగా ఉండిపోవడం అద్వానీలోని మరో కోణాన్ని తెలియచేస్తుంది. తాను వాజ్ పేయి తరువాతనే అని చెప్పి అలా తన భక్తిని చాటుకున్నారు. ఉప ప్రధాని దాకానే ఆయన పనిచేయగలిగారు

నిజానికి 2004 ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే అద్వానీయే ప్రధాని అయి ఉండేవారు. కానీ అలా జరగలేదు. దానికి ఆరు నెలల ముందు ఎన్నికలు పెట్టడం కూడా ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదం అని భావించేవారూ ఉన్నారు. ఏది ఏమైనా అద్వానీ బీజేపీకి ఎంతో చేశారు. కానీ ఆయన పొందినది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి.

తన గురువు వాజ్ పేయి కోసం అద్వానీ ప్రధాని పదవి త్యాగం చేశారు. కానీ ఆయన శిష్యుడిగా రంగంలోకి వచ్చిన నరేంద్ర మోడీ మాత్రం గురువు అద్వానీ కోసం 2014లో ప్రధాని పదవి కనీసం రెండేళ్ళు అయినా త్యాగం చేయలేకపోయారు అన్నది ఒక విమర్శ ఉంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా అద్వానీని కనీసం భారత రాష్ట్రపతిగా నియమించి ఉంటే ఎంతో కొంత న్యాయం జరిగేది అన్నది కూడా మరో వాదన ఉంది.

మోడీ ప్రధానిగా ఉండగా 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అద్వానీ పేరునే బీజేపీ ప్రతిపాదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అనూహ్యంగా రాం నాధ్ కోవింద్ ని చాన్స్ లభించింది. 2019 తరువాత అద్వానీ ఎన్నికల రాజకీయాలకే దూరం అయిపోయారు. ఆయన వయసు ఇపుడు 96 ఏళ్ళు. ఈ వయసులో ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా గురువు రుణం ఎంతో కొంత అయినా మోడీ తీర్చుకున్నారు అని అంటున్నారు.

అయితే అద్వానీ గురించి ఒక మాట ఉంది తన గురువు వాజ్ పేయ్ తన శిష్యుడు మోడీల మధ్యలో నిలబడి ఎప్పటికైనా ప్రధాని కావాలన్న తన ఆశను నెరవేర్చుకోలేకపోయారు అని. అయితే పదవుల కంటే కీర్తి ఎప్పటికీ శాశ్వతం. అలా అజరామమ్రైన కీర్తిని సాధించిన అద్వానీ ఎవరు కాదన్నా భారత రాజకీయాల్లో శిఖరాయమైన నాయకుడు అనడంలో సందేహం అయితే లేదు.