Begin typing your search above and press return to search.

కశ్మీర్ పైనా కన్నేసిన ఆ ఉగ్రభూతం..మళ్లీ బయటకొస్తోంది.. బహుపరాక్!

ప్రపంచంలో ప్రమాదకరమైన ఆ మిలిటెంట్ సంస్థ కొన్నాళ్లుగా కోరల్లేని పాములా పడి ఉంది.. ఎక్కడికక్కడ అణచివేతతో వెనక్కుతగ్గింది. కానీ, ఒక్క పరిణామంతో మళ్లీ పైకి లేస్తోందనే కథనాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Jun 2025 12:30 AM
కశ్మీర్ పైనా కన్నేసిన ఆ ఉగ్రభూతం..మళ్లీ బయటకొస్తోంది.. బహుపరాక్!
X

ప్రపంచంలో ప్రమాదకరమైన ఆ మిలిటెంట్ సంస్థ కొన్నాళ్లుగా కోరల్లేని పాములా పడి ఉంది.. ఎక్కడికక్కడ అణచివేతతో వెనక్కుతగ్గింది. కానీ, ఒక్క పరిణామంతో మళ్లీ పైకి లేస్తోందనే కథనాలు వస్తున్నాయి. ఒకప్పుడు మన కశ్మీర్ పైనా కన్నేసిన ఆ సంస్థ రీ యాక్టివ్ అవుతుండడం ప్రపంచానికే పెను ప్రమాదం అనడంలో సందేహం లేదు.

గత ఏడాది డిసెంబరులో సిరియాలో పెద్ద రాజకీయ మార్పు జరిగింది. అధ్యక్షుడు అసద్.. ప్రజల తిరుగుబాటు కారణంగా దేశాన్ని వీడి పారిపోయారు. దీంతో దేశ పగ్గాలను హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే మిలిటెంట్ సంస్థ చేపట్టింది. హెచ్టీఎస్ గా పిలిచే ఈ సంస్థకు అహ్మద్ అల్-షారా నాయకుడు. అతడే ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు కూడా. 2029 వరకు సిరియాలో ఎన్నికలు లేనట్లే. అంటే అప్పటివరకు ఇతడే కొనసాగుతాడని చెప్పొచ్చు. కాగా, సిరియా ప్రజలు కోరుకున్నది ఒకటైతే.. జరుగుతున్నది మరోటిలా మారింది.

సిరియాలో అసద్ సర్కారు కూలిపోవడం భయంకర ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కు మళ్లీ ప్రాణం పోసిందని చెబుతున్నారు. ఇది యావత్ పశ్చిమాసియానూ ఆందోళనపరుస్తోన్న పరిణామం అని పేర్కొంటున్నారు. ఐసిస్ గతంలో ఇరాక్ తో పాటు సిరియాలోని చాలా భాగాన్ని ఆధీనంలోకి తీసుకుంది. తర్వాతి కాలంలో దానిని తరిమేశారు. ఇప్పడు మళ్లీ అవకాశం తీసుకుని తిరిగి వస్తోంది.

ఐసిస్ లో 1,500 నుంచి 3 వేల మంది ఫైటర్లు ఉన్నారు. వీరంతా ఎడారులు, పర్వతాల్లో ఆశ్రయం పొందుతూ మళ్లీ దాడులకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నారు. హెచ్టీఎస్ పాలనలో ఉన్న సిరియాలో గనుక పరిస్థితులు అస్థిరంగా మారితే అది ఐసిస్ పుట్టలో పాలు పోసినట్లేనని అంటున్నారు. ఖైదీలుగా ఉన్న తమవారిని విడిపించడం, కొత్తవారిని చేర్చుకోవడం తదితరాలతో పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. అందుకే దీనిని ఆపేందుకు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్), అంతర్జాతీయ మిత్రదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఐసిస్ రహస్య స్థావరాలపై వైమానిక దాడులు చేయడం, ఐసిస్ ఖైదీలున్న జైళ్లకు, శరణార్థి శిబిరాలకు కాపలా కాయడం వంటి చర్యలు చేపట్టాయి.

కాగా, ఐసిస్ గతంలో కశ్మీర్ కూ విస్తరిస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ, దాని యత్నాలు ముందుకుసాగలేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.