Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ హైకామండ్ అటు నుంచి నరుక్కుని వస్తున్నారా?

వీళ్ళంతా చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీళ్ళలో అసంతృప్తి ఏ స్ధాయిలో ఉందంటే తెలంగాణ పర్యటనకు నరేంద్రమోడీ వచ్చినా కలవలేదు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 6:13 AM GMT
కాంగ్రెస్ హైకామండ్ అటు నుంచి నరుక్కుని వస్తున్నారా?
X

తెలంగాణా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ గాలమేస్తోందా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పటినుండో గాలమేస్తున్నా ఇపుడు స్పీడు పెంచిందంతే. బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాతో ఈ అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. బుధవారమే కోమటిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కారణం ఏమిటంటే చాలాకాలంగా కోమటిరెడ్డి బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి అసంతృప్త నేతలు ఇంకా చాలామంది ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, వివేక్ లాంటి సీనియర్ నేతలు బీజేపీలో ఇంకా ఉన్నారు. వీళ్ళంతా చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీళ్ళలో అసంతృప్తి ఏ స్ధాయిలో ఉందంటే తెలంగాణ పర్యటనకు నరేంద్రమోడీ వచ్చినా కలవలేదు. వీళ్ళందరు కూడా తాము కాంగ్రెస్ లో చేరే ఉద్దేశ్యంలో లేమనే పైకి చెబుతున్నారు. కోమటిరెడ్డి కూడా చాలాసార్లు ఇలాగే చెప్పారు. చివరకు బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు.

అసంతృప్త లీడర్లతో పీసీసీ స్ధాయిలో కాకుండా నేరుగా ఏఐసీసీ ముఖ్యనేతలే టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి సీనియర్లను ఆకర్షించి నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చే ఉద్దేశ్యంలో ఏఐసీసీ పెద్దలున్నట్లు తెలుస్తోంది. అందుకనే రెండోజాబితా ఆలస్యమవుతోంది. అలాగే ఇంకా కొన్ని నియోజకవర్గాలను పెండింగులో పెట్టాలని కూడా డిసైడ్ చేశారట. ఎందుకంటే కొండా, విజయశాంతి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తే ఎంఎల్ఏలుగా పోటీచేస్తారా లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తారా అనే క్లారిటిలేదు. అందుకనే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేయకుండా పెండింగులో ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

మామూలుగా అయితే గురువారం సెకండ్ లిస్టు రిలీజవ్వాలి. మరి అవుతుందో లేదో తెలీదు. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరబోతున్న కోమటిరెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అంటున్నారు. కేసీయార్ పోటీచేస్తున్న గజ్వేలుతో పాటు మునుగోడులో కూడా పోటీకి సై అంటున్నారు. అయితే గజ్వేలులో ఇప్పటికే నర్సారెడ్డిని అభ్యర్ధిగా కాంగ్రెస్ ప్రకటించేసింది. కోమటిరెడ్డి తాజా ప్రతిపాదనతో పార్టీలో అయోమయం మొదలైంది. ఇలాంటి సమస్యలు రాకుండానే అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.