Begin typing your search above and press return to search.

బొత్సను పక్కన పెడుతున్నారా ?

వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఏపీ శాసనమండలిలో విపక్ష నాయకుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది అంటే 2027 డిసెంబర్ వరకూ ఆయన ఎమ్మెల్సీ పదవి లీడర్ ఆఫ్ అపొజిషన్ పదవి కూడా ఉంటాయి.

By:  Satya P   |   4 July 2026 10:00 AM IST
బొత్సను పక్కన పెడుతున్నారా ?
X

వైసీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఏపీ శాసనమండలిలో విపక్ష నాయకుడిగా ఉన్నారు. వచ్చే ఏడాది అంటే 2027 డిసెంబర్ వరకూ ఆయన ఎమ్మెల్సీ పదవి లీడర్ ఆఫ్ అపొజిషన్ పదవి కూడా ఉంటాయి. ఇక ఉత్తరాంధ్రాలో బీసీ నేతగా తూర్పు కాపులకు పెద్ద దిక్కుగా బొత్స ఉన్నారు. ఆయనది సుదీర్ఘమైన రాజకీయం, ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఒక దశలో ముఖ్యమంత్రి కూడా అవాల్సిన వారుగా ప్రచారంలో ఉంది. అటువంటి బొత్స 2014 తరువాత కాంగ్రెస్ ఏపీలో ఉనికి కోల్పోవడంతో వైసీపీలో చేరారు. అయితే బొత్సకు వైసీపీకి ఈ చేరిక కలయిక అన్నది అనాటి రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో అనివార్యం అని అంటున్నారు. వైసీపీ కూడా విజయనగరం జిల్లాలో సరైన లీడర్ షిప్ లేక అవస్థలు పడుతున్న వేళ బొత్స తన చేయి అందించారు. అలాగే బొత్సకు సరైన రాజకీయ వేదికగా వైసీపీ కూడా నిలిచింది అని గుర్తు చేస్తున్నారు.

ప్రయారిటీ ఇచ్చి మరీ :

ఇక వైసీపీలో బొత్సకు మంచి ప్రాధాన్యత అయితే దక్కింది. ఆయన మాటే చెల్లుబాటు అవుతూ వచ్చింది. 2019 కానీ 2024 ఎన్నికలు కానీ విజయనగరం జిల్లాలో బొత్స చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. అలాగే బొత్స కూడా అయిదేళ్ళ పాటు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. మొదట మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ తరువాత విద్యా శాఖ మంత్రిగా బొత్స పనిచేశారు. ఇక 2024లో బొత్స ఓటమి పాలు అయితే విశాఖ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఆయనని నిలబెట్టి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గెలిచిన వెంటనే బొత్సను లీడర్ ఆఫ్ అపొజిషన్ గా నియమించారు. బొత్స వంటి సీనియర్ ద్వారా వైసీపీ వాయిస్ మండలిలో గట్టిగా వినబడుతుందని అలాగే వైసీపీ అసెంబ్లీకి వెళ్ళని నేపధ్యంలో అ ఆ లోటు భర్తీ అవుతుందని భావించి ఇలా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. కూటమిని ఇరుకున పెట్టడానికి కూడా బొత్సను ప్రయోగించారు అన్న మాట కూడా ఉంది.

బొత్స అనారోగ్యంతోనే :

ఇక బొత్స గతంలో కొంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. మార్చిలో జరిగిన బడ్జెట్ సెషన్ లో అయితే ఆయన సభలో మాట్లాడుతూ తూలిపడబోయారు. ఆయనకు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు అని ప్రచారం సాగింది. దానికి తగినట్లుగానే బొత్స కొంత కాలం పాటు రెస్ట్ తీసుకున్నారు. ఈ సమయంలోనే బొత్స ప్లేస్ లో మరొకరికి మండలిలో విపక్ష నేతగా నియమిస్తారు అన్న ప్రచారం సాగింది. అయితే మళ్ళీ బొత్స యాక్టివ్ అయ్యారు, మీడియా సమావేశాలు పెడుతున్నారు, అదే విధంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆయనే వచ్చే ఏడాది వరకూ ఆ పదవిలో ఉంటారు అన్నది అయితే తేలుతున్న విషయం. అయితే బొత్స అనారోగ్యం బారిన పడి తిరిగి యాక్టివ్ అయినా జగన్ తో భేటీ అయింది లేదని ప్రచారం అయితే సాగుతోంది. ఈ మధ్యన జగన్ స్టీల్ ప్లాంట్ లో పది మంది చనిపోతే పరామర్శకు వచ్చినపుడు ఆయన పక్కన బొత్స కనిపించలేదని గుర్తు చేస్తున్నారు.

పక్కన పెడుతున్నారా :

బొత్సను వైసీపీలో పక్కన పెడుతున్నారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో వస్తోంది. ఈ మాటలు అంటున్నది కూడా బీజేపీ నేతలు, సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బొత్సను వైసీపీలో పక్కన పెడుతున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కాపులకు తగిన ప్రాధాన్యత ఉండదు అనడానికి ఇదే నిదర్శనం అని కూడా ఆయన చెబుతున్నారు, మరి ఆయన కాపుల విషయంలో వైసీపీ ఇటీవల జోరు చేస్తున్న నేపథ్యంలో చేసిన విమర్శలుగా దీనిని చూడాలా లేక నిజంగా బొత్సను వైసీపీలో దూరం పెడుతున్నారని భావించాలా అన్నది అయితే చర్చగానే ఉంది. బొత్స అయితే ఈ మధ్య కాలంలో జగన్ ని కలిసింది లేదు అని గుర్తు చేస్తున్నారు. మరి వైసీపీలో బొత్స పరిస్థితి ఏమిటి ఆయన సౌకర్యంగానే ఉన్నారా లేక ఈ ప్రచారం అంతా ఒట్టిదేనా అంటే దానిని జవాబు ముందు ముందు తెలుస్తుందని అంటున్నారు.