ఒక్క లాటరీ.. అతడి జీవితాన్నే మార్చింది.. 2120 కోట్లతో సెలబ్రెటీ
ఐర్లాండ్‌కు చెందిన ఒక సామాన్య వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లాటరీని గెలిచి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు.
By: Tupaki Desk | 20 Jun 2025 1:00 AM ISTఐర్లాండ్‌కు చెందిన ఒక సామాన్య వ్యక్తి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లాటరీని గెలిచి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. ఏకంగా రూ. 2,120 కోట్ల విలువైన యూరోమిలియన్స్ జాక్‌పాట్‌ను గెలుచుకుని తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. ఇది ఐర్లాండ్ చరిత్రలోనే కాదు, యూరప్ మొత్తంలోనే అత్యధిక లాటరీ బహుమతిగా నిలిచింది.
ఐరిష్ నేషనల్ లాటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సియాన్ మర్ఫీ ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ బహుమతి మొత్తం 208 మిలియన్ పౌండ్లుగా ఉందని, భారత కరెన్సీలో సుమారు రూ. 2,120 కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే ఇప్పటివరకు ఈ అదృష్టవంతుడి పేరు, వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే అతడి వివరాలను బయటపెట్టనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఐర్లాండ్ అంతటా ఆ విజేత ఎవరన్న ఆసక్తికర చర్చ మొదలైంది. గెలిచిన లక్కీ నంబర్లు 13, 22, 23, 44, 49, లక్కీ స్టార్స్ 03, 05 అని పేర్కొన్నారు. ఈ విజయంతో కొత్తగా రికార్డుల్లోకి ఎక్కిన వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ ఫుట్‌బాల్ స్టార్ హ్యారీ కేన్, పాప్ సింగర్ దువా లిపా వంటి ప్రముఖుల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నాడు.
-ఒకే ఒక్క టికెట్‌తో కోట్లాది సంపద!
ఈ జాక్‌పాట్ గత రెండు వారాలుగా క్లెయిమ్ చేయని స్థితిలో ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే, ఎట్టకేలకు ఆ అదృష్టవంతుడు దాన్ని క్లెయిమ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఐర్లాండ్‌కు 18వ యూరోమిలియన్స్ జాక్‌పాట్ గెలుపు కావడం విశేషం. బ్రిటన్‌లో గెలిచి ఉంటే అది అక్కడికి అతిపెద్ద రికార్డు అయ్యేదని సమాచారం.
ఇప్పుడు ఈ విజేత "ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025"లో ధనవంతుల జాబితాలో చేరిపోయారు. ఒక చిన్న లాటరీ టికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చగలదని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. ఐర్లాండ్‌లో ఈ విజేత పేరు రహస్యంగానే ఉన్నప్పటికీ, అతడి అదృష్టం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెలబ్రిటీల కంటే పెద్ద సంపదను ఈ విజేత ఒక్కరాత్రిలో సంపాదించడం వింతగానూ, ఆశ్చర్యంగానూ మారింది.
లాటరీ టికెట్.. అదృష్టం దక్కితే మానవుడి జీవితమే మారిపోతుంది! అందుకు ఇతడి జీవితమే ఉదాహరణగా చెబుతున్నారు.
