Begin typing your search above and press return to search.

పెళ్లి వేడుకలో ఘోరం... 114 మంది మృతి... వధూవరుల పరిస్థితి?

అవును... ఉత్తర ఇరాక్ లో అల్ హమ్దానియా పట్టణంలోని ఓ ఈవెంట్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 6:50 AM GMT
పెళ్లి వేడుకలో ఘోరం... 114 మంది మృతి... వధూవరుల పరిస్థితి?
X

ఇరాక్ లో విషాదం చోటు చేసుకుంది. పచ్చని పెళ్లి పందిట్లో అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. దీంతో పెళ్లి వేడుక కాస్తా అతిపెద్ద విలయంగా మారిపోయింది. సంబరాలు, నవ్వులతో నిండాల్సిన ఫంక్షన్ హాలు ఏడుపులు, రోదనలతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 114 మంది ఇప్పటివరకు మృతి చెందారని తెలుస్తుంది.

అవును... ఉత్తర ఇరాక్ లో అల్ హమ్దానియా పట్టణంలోని ఓ ఈవెంట్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకూ సుమారు 114 మంది మరణించారని చెబుతుంటే... మరో 150 మందికి పైగా గాయపడ్డారని అంటున్నారు.

వివరాళ్లోకివెళ్తే... ఇరాక్‌ లోని నినెవేహ్‌ ప్రావిన్స్‌ లో ఓ ఫంక్షన్‌ హాల్‌ లో మంగళవారం రాత్రిపెళ్లి వేడుక జరుగుతుంది. ఈ సమయంలో ఉన్నట్లుండి మంటలు వ్యాపించడం మొదలయ్యాయి. ఈ సమయంలో కన్ను మూసి తెరిసే లోగా అన్నట్లుగా క్షణాల్లో మంటలు చుట్టుముట్టేశాయి. హాలంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

దీంతో ఈ వేడుకలో పాల్గొన్న బంధువులు, అతిధులు, కుటుంబసభ్యులు అందులో చిక్కుకుపోయారు. ఈ సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

ఇందులో భాగంగా సుమారు 114 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 150 మంది గాయపడ్డారని నినెవేహ్‌ ప్రావిన్స్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో హాస్పటల్ లో ఉన్న క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు అధికారులు.

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పూర్తి అంచనాకు రానప్పటికీ... పెళ్లి వేడుకలో విచ్చలవిడిగా పేల్చిన బాణసంచా కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రమాదంలో వధువరుల పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది!