షాకింగ్ ఘటన.. పెంపుడు సింహం చేతిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి!
ఇరాక్‌లో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. నజాఫ్ గవర్నరేట్‌లోని అల్-బరాకియా జిల్లాలో 50 ఏళ్ల ఇరాకీ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
By: Tupaki Desk | 15 May 2025 12:00 AM ISTఇరాక్‌లో ఒక భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. నజాఫ్ గవర్నరేట్‌లోని అల్-బరాకియా జిల్లాలో 50 ఏళ్ల ఇరాకీ వ్యక్తి తన పెంపుడు సింహం దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు, ఆ సింహం అతడి శరీరాన్ని కొంతమేర తినేసింది కూడా. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వ్యక్తి సింహాన్ని తెచ్చుకున్న కొద్ది రోజులకే ఈ దుర్ఘటన జరగడం మరింత కలచివేస్తోంది. స్థానిక కథనాల ప్రకారం.. అఖిల్ ఫఖర్ అల్-దిన్ అనే వ్యక్తి కూఫాలోని తన తోటలో సింహం బోను దగ్గరికి వెళ్లినప్పుడు అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు.
అల్-దిన్ తన ఇంట్లో అరుదైన జంతువులను పెంచుకునే వ్యక్తిగా ఆ ప్రాంతంలో పేరుగాంచాడు. అల్-హసినాత్ ప్రాంతంలో ఈ ఘోరమైన సంఘటన జరగడానికి దాదాపు ఒక నెల ముందు నుంచే అతడు ఆ సింహాన్ని తన తోటలో పెంచుతున్నాడు. అల్-ఘాద్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. సింహం ఒక్కసారిగా అల్-దిన్‌పై దూకి, అతడి మెడ, ఛాతీకి తీవ్ర గాయాలు చేసింది. ఆ తర్వాత అతడి శరీరం కొంత భాగాన్ని తినేసింది. "కుటుంబ సభ్యుల కేకలు విని పొరుగువాడు వెంటనే తన ఆయుధంతో సింహాన్ని కాల్చి చంపాడు. అలా ఆ భయంకరమైన దాడి ముగిసింది" అని ఒక భద్రతా అధికారి ఆ వార్తాపత్రికకు తెలిపారు.
సాధారణ ప్రక్రియల ప్రకారం.. అధికారులు అల్-దిన్ మృతదేహాన్ని పరీక్ష కోసం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించారు. ఇదిలా ఉండగా చనిపోయిన సింహం రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఈ విషాదకరమైన సంఘటన ఇరాక్ అంతటా నివాస ప్రాంతాల్లో మాంసాహార జంతువులను పెంచుకోవడం పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. సరైన చట్టపరమైన నిబంధనలు, వెటర్నరీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రజల భద్రతకు తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని విమర్శకులు అంటున్నారు.
అల్-దిన్ దాడికి ముందు సంవత్సరాలుగా తన ఇంటి తోటలో సింహాలు, ఇతర అడవి జంతువుల సేకరణను కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో అరుదైన పెంపుడు జంతువుల పెంపకం ప్రమాదకరమని ఈ ఘటన నిరూపిస్తుంది.
