Begin typing your search above and press return to search.

‘‘మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్ మిగలదు’’.. అయినా అదే జరిగింది

‘‘మాపై చిన్నస్థాయి దాడి జరిగినా.. ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   19 April 2024 7:21 AM GMT
‘‘మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్ మిగలదు’’.. అయినా అదే జరిగింది
X

‘‘మాపై చిన్నస్థాయి దాడి జరిగినా.. ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. మేం భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదు’’ -ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రౌసీ. ఆయన ఈ మాటలన్న ఒక్క రోజుకే ఇరాన్ అణు నగరం ఇస్ఫహాన్ పై దాడి జరిగింది. దీనిని వెనుకున్నది ఇజ్రాయెల్ అని స్పష్టమవుతున్నా.. ఆ దేశం మాత్రం నోరు విప్పడం లేదు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి.

అణు కేంద్రాన్ని గురిచూసి?

ఇరాన్ లో ఇస్ఫహాన్ నగరం అణు కార్యక్రమాలకు కేంద్రం.

అతిపెద్ద సైనిక శిబిరం, పలు అణు కేంద్రాలున్న ఇక్కడ శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ చెబుతోంది. అణు కేంద్రం సురక్షితంగా ఉందని ఇరాన్‌ ప్రకటించింది. ఈ నగరంలోని ఎయిర్‌ పోర్టు, ఎయిర్‌ బేస్‌ సమీపంలో పేలుళ్లు జరిగాయని పేర్కొంది. కాకపోతే, క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపారు. గత వారం ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసిందని అమెరికా చెబుతోంది. అయితే వీటిని ఇజ్రాయెల్‌ అంగీకరించడం లేదు.

ఇస్ఫహాన్ అంతా అలర్ట్

ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇస్ఫహాన్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.. ప్రాణ నష్టం జరిగినట్లు ఆధారాలు లేవు. ఇస్ఫహాన్, షిరాజ్‌, టెహ్రాన్‌ మీదుగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. కాగా, ఇరాన్‌ లో పేలుళ్లు ఇజ్రాయెల్‌ ప్రతీకారమేనని అమెరికా సైనికాధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ‘ప్రస్తుతానికి మేం ఏం మాట్లాడలేం’’ అని ఇజ్రాయెల్ పేర్కొనడం గమనార్హం. అయితే.. ఈ దాడులకు కొన్ని గంటల ముందే.. ఇజ్రాయెల్-అమెరికా రక్షణ మంత్రలు ఫోన్ లో సంభాషించుకున్నారని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ వెల్లడించింది. దాడి గురించి ఇజ్రాయెల్‌ ప్రస్తావించలేదని తెలిపింది. 24 నుంచి 48 గంటల్లో ఇరాన్‌ పై దాడి చేస్తామని మాత్రం చెప్పినట్లు తెలుస్తోంది.

తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్‌లోని ఆస్ట్రేలియన్లు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశముందని హెచ్చరించింది