Begin typing your search above and press return to search.

ఇ.. ఇ... మరి 'ఇండియా' ఎటు?

అణ్వస్త్ర దేశమైన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది. ఆదివారం భారీఎత్తున డ్రోన్, క్షిపణి దాడులతో పశ్చిమాసియా వణికింది

By:  Tupaki Desk   |   15 April 2024 2:30 PM GMT
ఇ.. ఇ... మరి ఇండియా ఎటు?
X

పశ్చిమాసియా అంటేనే కక్షల గడ్డ. ఒకవైపు ఇజ్రాయెల్ మరోవైపు అరబ్ దేశాలు. ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య ఘర్షణలతో 75 ఏళ్లుగా ఆరని నిప్పుల కుంపటిగా రగులుతోంది. ఇలాంటి సమయంలో ఆరు నెలల కిందట ఇజ్రాయెల్ పై హమాస్ విరుచుకుపడింది. ఇదే అదనుగా ఇజ్రాయెల్ ఎదురుదాడి కొనసాగిస్తూ 30 వేల మందిని బలిగొంది. ఈ యుద్ధం సరిపోదన్నట్లు సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి దిగి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ జనరల్స్ ను హతమార్చింది.

ఇరాన్ తగ్గదు.. ఇజ్రాయెల్ ఆగదు

అణ్వస్త్ర దేశమైన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడులకు దిగుతోంది. ఆదివారం భారీఎత్తున డ్రోన్, క్షిపణి దాడులతో పశ్చిమాసియా వణికింది. వీటిని తిప్పికొట్టామని ఇజ్రాయెల్ చెబుతున్నా వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది. ఇక ఆదివారం ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచాయి అమెరికా, బ్రిటన్. వాటి మద్దతు తొలి నుంచి ఆ దేశానికే. ఇరాన్ అంటేనే అమెరికా బద్ద శత్రువుగా చూస్తుంది. బ్రిటన్ పైకి చెప్పుకున్నా ఇజ్రాయెల్ పక్షమే. ఈ రెండూ ఎటుచెబితే అటు మొగ్గుతాయి నాటో దేశాలు. వీటికి ఆగర్భ శత్రువైన రష్యా ఇప్పటికే ఇరాన్ వైపు నిలిచింది.

మరి మన సంగతి?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యన ఎటువైపు ఉండాలో తేల్చుకోవడం భారత్ కు కష్టమే...? భారత్ కు శత్రువైన పాకిస్థాన్ అటు ఇరాన్ కూ శత్రువే. ఇప్పటికే దాడులు-ప్రతిదాడులతో ఇరాన్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ తమ పౌరులను చంపిందంటూ.. ఆ దేశ భూభాగంపై పాక్ ప్రతిదాడులు చేసింది. కాబట్టి సహజంగానే భారత్ కు ఇరాన్ దగ్గర. మరోవైపు ఇజ్రాయెల్ కూడా కొన్ని దశాబ్దాలుగా భారత్ తో అత్యంత సన్నిహితంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా పార్లమెంటుపై ఉగ్ర దాడి, ముంబై ఉగ్ర దాడుల అనంతరం ఇజ్రాయెల్ టెక్నాలజీ విషయంలో భారత్ కు బాగా సహకరించింది. ఇంకా అనేక విషయాల్లో భాగస్వామ్యం కొనసాగుతోంది.

మధ్యేమార్గమే మేలు?

రెండూ సన్నిహిత దేశాలే కాబట్టి.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన ఎవరి వైపున నిలవడమో కాక.. మధ్యే మార్గం అనుసరించడమే భారత్ చేయదగిన పని. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఆదివారం భారత్ చేసిన ప్రకటన కూడా ఇదే విధంగా ఉంది. మరోవైపు ఉక్రెయన్-రష్యా యుద్ధంలోనూ భారత్ ఇదే విధంగా వ్యవహరించింది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఇది యుద్ధాల కాలం కాదంటూ ఏకంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్పష్టం చేశారు. ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ ముదిరి యుద్ధంగా మారితే అది పశ్చిమాసియాకే కాదు. యావత్ ప్రపంచానికీ ముప్పే. కాబట్టి భారత్ అత్యంత సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది.